● ఏప్రిల్ 9 నుంచి 24 వరకు ‘ప్రధాన్‌మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్’
● ఎంపీ డీకే అరుణ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఏప్రిల్ 9 నుంచి 24 వరకు నిర్వహించనున్న ‘ప్రధాన్‌మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్’ ద్వారా గ్రామీణ యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారికి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. ఈ క్రీడా మహోత్సవానికి సంబంధించి శనివారం కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ మండల, అసెంబ్లీ స్థాయి ఇన్‌చార్జులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, యువజన క్రీడాశాఖ అధికారులు, పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు తదితరులు సమన్వయంతో పనిచేసి ఈ క్రీడ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవం ఏప్రిల్ 9న నారాయణపేటలో నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామస్థాయి జట్లు ఏప్రిల్ 6లోగా ఆఫ్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 9 నుంచి 15 వరకు మండల స్థాయి పోటీలు, ఏప్రిల్ 15 నుంచి 20 వరకు అసెంబ్లీ స్థాయి పోటీలు, ఏప్రిల్ 21 మరియు 22 తేదీల్లో పార్లమెంటరీ స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 23న రన్నింగ్‌రేస్ నిర్వహిస్తామని, ఏప్రిల్ 24న బహుమతుల ప్రదానోత్సవం, ముగింపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ముగింపు కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రీడా మహోత్సవంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి మండలంలో ప్రతి క్రీడకు ఒక కో–ఆర్డినేటర్ చొప్పున నలుగురిని నియమించి పోటీల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. యువత శారీరక, మానసిక అభివద్ధికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని, డ్రగ్స్ వంటి చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ క్రీడలలో పురుషులతో పాటు సీ్త్రలు, బాలికలకు కూడా ప్రాముఖ్యత ఇచ్చి వారిని పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని ఎంపీ సూచించారు. సమావేశంలో డీఈఓ ప్రవీణ్ కుమార్, డీవైఎస్‌ఓలు శ్రీనివాస్, వెంకటేష్, సుధీర్‌రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ తిరుపతిరెడ్డి, డిప్యూటీ సీఈఓ మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.


