నారాయణపేట: జిల్లాలో శిక్షణ పొందడం అదృష్టంగా భావిస్తున్నానని శిక్షణ కలెక్టర్ ప్రణయ్‌కుమార్ అన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శిక్షణ కలెక్టర్ వీడ్కోలు సమావేశం నిర్వహించగా.. కలెక్టర్ ప్రతీక్‌జైన్, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఎస్‌డీసీ రాజేందర్‌గౌడ్, జిల్లా అధికారులు పాల్గొని పూలమాల, పుష్పగుచ్ఛాలు, శాలువాలతో ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శిక్షణ కాలంలో ప్రణయ్‌కుమార్ చూపిన నిబద్ధత, చిత్తశుద్ధిని కొనియాడారు. ముఖ్యంగా నర్వ యాస్పిరేషన్ బ్లాక్‌లో చేపట్టిన కార్యక్రమాలు, ఆలోచనలు, అధికారులకు చేసిన దిశా నిర్దేశం అభినందనీయమన్నారు. భవిష్యత్‌లో ఎక్కడ, ఏ స్థాయిలో ఉన్నా నారాయణపేటను మరవొద్దని కోరారు. అనంతరం ప్రణయ్‌కుమార్ మాట్లాడుతూ.. బదిలీపై వెళ్లిన కలెక్టర్ సిక్తా పట్నాయక్, ప్రస్తుత కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఆర్డీఓ, ఇతర అన్నిశాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ శ్రీధర్, సూపరింటెండెంట్ జయసుధ, డీపీఆర్వో రషీద్, ఎస్పీకార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్, డీటీ అఖిల ప్రసన్న, నర్వ తహసీల్దార్ మల్లారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్, మక్తల్ తహసీల్దార్ సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


