మహనీయుల జయంతిని ఘనంగా నిర్వహిద్దాం | - | Sakshi
Sakshi News home page

మహనీయుల జయంతిని ఘనంగా నిర్వహిద్దాం

Apr 1 2026 8:12 AM | Updated on Apr 1 2026 8:12 AM

కలెక్టరేట్‌లో జగ్జీవన్‌రామ్‌,

అంబేడ్కర్‌ చౌరస్తాలో

అంబేడ్కర్‌ జయంతి వేడుకలు

ఏర్పాట్లకు కలెక్టర్‌ ఆదేశం

నారాయణపేట: స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని బా బు జగ్జీవన్‌రామ్‌, రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అధికారికంగా బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతిని 5న కలెక్టరేట్‌లో, 14న డా. బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతిని జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో నిర్వహించనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ అబ్దుల్‌ ఖలీల్‌ కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. గతేడాది వేడుకలను ఎలా నిర్వహించారో.. ఈసారి కూడా అలాగే కొనసాగించాలని, ఏర్పాట్లలో ఎక్కడ చిన్న పొరపాటుకు కూడా తావివ్వొద్దని సూచించారు. సమావేశంలో పాల్గొన్న పలువురు దళిత సంఘాల సభ్యులు మాట్లాడుతూ.. జిల్లాకేంద్రంలో బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో మున్సిపల్‌ కౌన్సిల్‌లో కూడా తీర్మానం చేశారని, పట్టణంలోని ఎరగ్రుట్ట వద్ద ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. నిబంధనల మేరకు ప్రభుత్వ అనుమతితో విగ్రహం ఏర్పాటు చేసుకుందామని చెప్పారు. ఏటా అంబేడ్కర్‌ జయంతి తర్వాత అంబేడ్కర్‌ జాతరను అట్టహాసంగా నిర్వహిస్తామని, ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం అందించాలని అంబేడ్కర్‌ జాతర కమిటీ సభ్యులు కోరారు. షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధిశాఖ పరంగా జాతరకు ఎలాంటి నిధుల ప్రొవిజన్‌ లేదని, జయంతిని మాత్రమే అధికారికంగా నిర్వహిస్తున్నామని ఈడీ కలెక్టర్‌కు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫణీంద్రరెడ్డి, శ్రీను, మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ఎంఏ రషీద్‌, కౌన్సిలర్‌ మహేష్‌, జయశ్రీ, దళిత సంఘాల సభ్యులు శరణప్ప, ఈశ్వరమ్మ, మహదేవ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement