మహిళల సంక్షేమానికి పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

మహిళల సంక్షేమానికి పెద్దపీట

Apr 1 2026 8:12 AM | Updated on Apr 1 2026 8:12 AM

పేదలకు అండగా ప్రభుత్వం

కాంగ్రెస్‌ పాలనలోనే గ్రామాల అభివృద్ధి

రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి

వాకిటి శ్రీహరి

మక్తల్‌: రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ దగ్గర నిర్వహించిన కార్యక్రమానికి ఆయనతో పాటు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీకి రూ.10 వేల కోట్ల ఆదాయం సమకూరిందని.. కాంగ్రెస్‌ ప్రజాపాలనలో పునరుజ్జీవం వచ్చిందన్నారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం పని చేస్తుందని, రెండేళ్లలో 290 కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేశారని, దీంతో రూ.10 వేల కోట్ల ఆదాయం ఆర్టీసీకి సమకూరిందని పేర్కొన్నారు. జిల్లా మహిళలు రోజు రూ.12 లక్షలు ఆదా చేసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని.. ఉచిత బస్పు ప్రయాణంతో మహిళలు డబ్బు ఆదా చేసుకుంటున్నారని వివరించారు. ఇంటిని నడిపే శక్తి ఉన్న మహిళలు దేనినైనా సాధించగలరని.. మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతకుముందు కలెక్టర్‌ మక్తల్‌కు మొదటిసారి వచ్చిన సందర్భంగా మంత్రి ఆయనకు మొక్క అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీను, ఫణింద్ర, పుర చైర్‌పర్సన్‌ వాకిటి మానస, డిపో మేనేజర్‌ లావణ్య, మార్కెట్‌ చైర్‌పర్సన్‌ రాధమ్మ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, బీకేఆర్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ బాలకృష్ణారెడ్డి, కౌన్సిలర్లు రహీం పటేల్‌, అమరేందర్‌రెడ్డి, వాకిటి హన్మంతు, వైస్‌ చైర్మన్‌ గణేష్‌కుమార్‌, గోవర్ధన్‌, రవికుమార్‌, రాజేందర్‌, రింత్‌రెడ్డి పాల్గొన్నారు.

నర్వ: నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇంటిని అందించి ప్రభుత్వం అండగా నిలిచిందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మండలంలోని కుమార్‌లింగంపల్లిలో నిర్మాణం పూర్తి అయిన ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూంలు అంటూ ఆశ పెట్టి ప్రజలను మోసం చేసిందన్నారు. అదే ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా సౌభాగ్యం అందించే దిశగా సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనువాసులు, ఎంపీఓ రాఘవేందర్‌, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు బీసం చెన్నయ్యసాగర్‌, మండల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement