ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు

Apr 1 2026 8:12 AM | Updated on Apr 1 2026 8:12 AM

బావాజీ జాతర ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్పీ డా. వినీత్‌

కొత్తపల్లి: మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో బుధవారం నుంచి జరిగే బావాజీ ఉత్సవాలకు జిల్లా పోలీస్‌శాఖ పటిష్ట బందోబస్తు కల్పించనున్నట్లు ఎస్పీ డా. వినీత్‌ తెలిపారు. మంగళవారం సాయంత్రం అధికారులతో కలిసి జాతర ప్రాంగణంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేలాది మంది భక్తులు హాజరయ్యే జాతరను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం పోలీస్‌శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రథోత్సవం రోజున ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రథానికి నలుదిక్కులా రోప్‌ పార్టీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు ప్రత్యేక ట్రాఫిక్‌ డైవర్షన్లు, వాహనాల పార్కింగ్‌కు వేర్వేరు స్థలాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. జాతరలో భక్తుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ, దొంతనాలు, ఈవ్‌టీజింగ్‌ వంటి ఘటనలను అరికట్టేందుకు మఫ్టీ పోలీసులను మొహరిస్తామన్నారు. మహిళలు, పిల్లల భద్రతకు ప్రత్యేక బృందాలు, అత్యవసర సమయాల్లో స్పందించేందుకు క్యూఆర్టీ టీం, జాతర ప్రాంగణంలో ప్రత్యేక పోలీస్‌ కంట్రోల్‌రూం ఏర్పాటు చేసినట్లు వివరించారు. భక్తులకు ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జాతర సమయంలో ప్రజలు పోలీసు అధికారులకు సహకరించాలని, రహదారి నియమాలు పాటించాలని, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు గుర్తిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. అనంతరం ఆలయంలోని బావాజి, కాళికాదేవిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట కోస్గి సీఐ సైదులు, మద్దూరు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌, ఎస్‌బీ ఎస్‌ఐ నరేష్‌, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement