హైవే నిర్మాణంతో జిల్లాకు మహర్దశ : మంత్రి
మక్తల్: మహబూబ్‌నగర్–గుడెబల్లూరు రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు కేంద్రం రూ.3,174 కోట్లు మంజూరు చేసిందని.. ఇందుకుగాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్‌నగర్, జడ్చర్ల ఎమ్మెల్యేలందరం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి రహదారి విస్తరణకు వినతిపత్రాలు అందించామని.. డిల్లీ పర్యటనలో కేంద్రమంత్రులను కలిసి మాట్లాడినట్లు చెప్పారు. సీఎం ఢిల్లీ పర్యటన ఫలితమే రహదారి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని.. ఏప్రిల్‌లో పనులు ప్రారంభమవుతాయన్నారు. రహదారి నిర్మాణం హ్యామ్ పద్ధతిలో చేపట్టనున్నట్లు వివరించారు. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీకేఆర్ ట్రస్ట్ చైర్మన్ బాలకిష్ణారెడ్డి, రవికుమార్‌యాదవ్, కట్టా సురేష్, కోళ్ల వెంకటేష్, శ్రీనివాసులు, రంజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ ప్రత్యేక పూజలు
మక్తల్: మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం పట్టణంలోని మల్లికార్జునస్వామి ఆలయాన్ని ఎస్పీ డా. వినీత్ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈశ్వరుడికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ పూజరి తిప్పయ్యస్వామి వారిని శాలువాతో సన్మానించారు. ఎస్పీ వెంట సీఐ రాంలాల్, మక్తల్ ఎస్‌ఐ భాగ్యలక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేటి ప్రజావాణి రద్దు
నారాయణపేట: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని.. వచ్చే వారం నుంచి యధావిధిగా కొనసాగిస్తామని వెల్లడించారు.
హైవే నిర్మాణంతో జిల్లాకు మహర్దశ : మంత్రి


