ఎత్తులు.. పొత్తులు!
–8లో u
నారాయణపేట: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పీఠాలను దక్కించుకునేందుకు ఆశావహులు పావులు కదుపుతున్నారు. కోస్గి, మద్దూర్, మక్తల్‌లో అధికార పార్టీకి సంపూర్ణ మెజార్టీ రావడంతో హస్తగతం చేసుకోవడం ఖాయమైంది. నారాయణపేట మున్సిపాలిటీలో అసలు ఏం జరుగుతుందోననే చర్చ కొనసాగుతోంది.
పేట కమలంలో మూడు ముక్కలాట..
నారాయణపేటలో 24 వార్డులుండగా.. 11 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. 10వ వార్డులో బీజేపీ రెబల్ అభ్యర్థి జయశ్రీ విజయం సాధించడంతో ఆమె బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సమక్షంలో పార్టీలో చేరడంతో బలం 12కు చేరింది. మున్సిపల్ చైర్మన్ పదవిని ఆశిస్తున్న వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ సతీమణి 4వ వార్డు కౌన్సిలర్ కొండ శ్వేత ఉన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో తాను చైర్మన్ అభ్యర్థిగా రంగంలో దిగానని, ఆ సమయంలో అవకాశం దక్కలేదని.. ఈ సారి కచ్చితంగా ఇవ్వాలంటూ పార్టీ రాష్ట్ర నేతలతో గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి రఘురామయ్యగౌడ్ తన సతీమణి 17వ వార్డు కౌన్సిలర్ కల్పనకు చైర్‌పర్సన్ అవకాశం ఇవ్వాలంటూ పట్టుబడుతున్నట్లు సమాచారం. బీజేపీకి అండగా నిలుస్తూ వస్తున్న జీఆర్‌రెడ్డి తన సతీమణి 6వ వార్డు కౌన్సిలర్ మంజులను చైర్‌పర్సన్ చేయాలంటూ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం ముందు వారి బలాబలాలు సైతం నిరూపించుకునేందుకు వెనుకాడటం లేదని సమాచారం. చైర్మన్ పదవి కోసం కమలంలో మూడు ముక్కలాట మొదలైందని.. ఎవరిని చైర్‌పర్సన్ చేస్తారోనని చర్చ కొనసాగుతుంది.
● మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తన ఎక్స్ అఫీషియో ఓటు ఇక్కడే వేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ ముగ్గురిలో ఎవరిని చైర్‌పర్సన్ చేయాలని అనుకుంటున్నారోనన్న చర్చ కొనసాగుతోంది.
‘హస్త’గతానికి ప్రయత్నాలు..
పేట మున్సిపాలిటీని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ బడా నేతలు వ్యూహరచన చేస్తున్నారు. కాంగ్రెస్‌కు 7, ఎంఐఎం 2, ఎఐఎఫ్‌బీ ఒకటితో కలిసి మొత్తం పది స్థానాలకు చేరుకుంది. బీఆర్‌ఎస్ మద్దతుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్‌ఎస్ మద్దతిస్తే బలం 12కు చేరుకుంటుంది. ఎమ్మెల్యే డా. చిట్టెం పర్నీకారెడ్డి సైతం ఇక్కడే తన ఎక్స్ అఫీసియో ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు మనోహర్‌గౌడ్ సతీమణి 14వ వార్డు కౌన్సిలర్ అరుణ, 20వ వార్డు కౌన్సిలర్ శ్వేత, 15వ వార్డు సిట్టింగ్ కౌన్సిలర్ బండి రాజేశ్వరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
సింహం బలమెవరికో..?
పేటలో రాజకీయ పరిణామాలు రెండ్రోజులుగా మలుపులు తిరుగుతున్నాయి. రెండు స్థానాల్లో విజయం సాధించిన బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు సైలెంట్‌గా ఉండటంతో తాము పీఠాన్ని అధిరోహించడమే తరువాయి అన్న ధీమాలో బీజేపీ ఉంది. 11వ వార్డులో ఏఐఎఫ్‌బీ పార్టీ తరఫున విజయం సాధించిన భాగ్యవతి ఓసారి కాంగ్రెస్‌కే మద్దతునిస్తుందని.. మరోసారి రూట్ మారుస్తుందనే చర్చ సాగుతుంది. దీంతో సింహం బలమెవరికో వేచి చూడాల్సిందే మరి.
మిగతా మూడు మున్సిపాలిటీల్లో..
జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు హస్తగతం కావడం ఖాయమని తెలవడంతో చైర్మన్ అయ్యేందుకు అశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. సీఎం ఇలాకాలోని కోస్గి మున్సిపాలిటీలో నాగులపల్లి నరేందర్ పేరు వినిపిస్తోంది. మద్దూర్‌లో ముగ్గురి పేర్లు తెరపైకి వచ్చాయి. మక్తల్ మున్సిపాలిటీలో మంత్రి మదిలో ఎవరున్నారో తెలియక ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
పేట కమలంలోమూడు ముక్కలాట
స్వతంత్రుడి చేరికతో 12 స్థానాలకు చేరిన బీజేపీ
ఎక్స్ అఫీషియో ఓటుకు దరఖాస్తుచేసుకున్న ఎంపీ, ఎమ్మెల్యే
హస్తగతానికి కాంగ్రెస్ ఎత్తుగడలు
బీఆర్‌ఎస్ సైలెంట్.. ‘సింహం’ బలమెవరికో?
మూడు మున్సిపాలిటీల్లో ఆశావహుల్లో ఉత్కంఠ


