మూడంచెల భద్రత ఏర్పాటు : ఎస్పీ
నారాయణపేట: మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్ బాక్సులు భద్రపర్చిన స్ట్రాంగ్‌రూంలు, కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డా.వినీత్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల, పాఠశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌రూం, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీల్లో శుక్రవారం ఓట్ల లెక్కింపు సందర్భంగా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. స్ట్రాంగ్‌రూం ప్రవేశ, నిష్క్రమణ మార్గాల వద్ద సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనుమతి లేని వ్యక్తులు స్ట్రాంగ్‌రూం, కౌంటింగ్ కేంద్రాల వద్దకు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు, వారి ఏజెంట్లు, ఇతరులు పోలీసులు సూచించిన ప్రదేశాల్లోనే వాహనాలను పార్కింగ్ చేయాలన్నారు. కౌంటింగ్ సెంటర్‌లోకి మొబైల్ ఫోన్లుతీసుకెళ్లడం నిషేధమన్నారు.
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు..
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున విజయోత్సవ ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదని ఎస్పీ తెలిపారు. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ మేరకు సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నందున ప్రజలు గుంపులుగా ఉండరాదన్నారు. మోడల్ కండక్ట్ కోడ్ ముగిసిన తర్వాత పోలీసుల అనుమతితో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకోవాలని ఎస్పీ సూచించారు. అనంతరం కౌంటింగ్ సెంటర్లలో ఏర్పాటుచేసిన టేబుళ్లు, అభ్యర్థుల ఏజెంట్లకు కేటాయించిన స్థానాలు, మీడియా పాయింట్, మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చించారు. లెక్కింపు ప్రక్రియ ఎన్నికల నియమావళి ప్రకారం పారదర్శకంగా, సజావుగా జరిగేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 550 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎస్పీ వెంట డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ శివశంకర్, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, నరేశ్, పురుషోత్తం ఉన్నారు.


