మున్సిపోల్స్‌కు కసరత్తు..!
72 వార్డుల మ్యాప్‌లు సిద్ధం.. 150 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
● మూడు పురపాలికల్లో పాత వార్డులే..
● కొత్తగా ఏర్పాటైన మద్దూర్‌లో 16 వార్డుల విభజన
● ఆర్‌ఓల నియామకానికి ఆదేశాలు
నారాయణపేట: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ముసాయిదా ఓటరు జాబితాను పుర అధికారులు ఇటీవల విడుదల చేయగా.. తుది జాబితా రూపకల్పనకు కసరత్తు చేస్తున్నారు.
4 పురపాలికలు.. 72 వార్డులు...
జిల్లాలోని నారాయణపేట, కోస్గి, మక్తల్ మున్సిపాలిటీలు పాతవే కావడంతో వార్డుల మార్పు జరగలేదు. నారాయణపేటలో 1,800 ఓట్లున్న వార్డులో మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఒక్కో వార్డుకు ఒకటి లేదా రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు మక్తల్, కోస్గి విలీన గ్రామపంచాయతీలు, శివారు ప్రాంతాలు కలిగిన వార్డుల్లో రెండు, మూడు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేస్తారా లేక 1,600 ఓట్లలోపు ఉండటంతో రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారా అనేది అధికారులు నిర్ణయించాల్సి ఉంది. ఫొటో ఓటరు జాబితాతో పాటు వార్డు, పోలింగ్ కేంద్రాలపై ఫిర్యాదులు, అభ్యంతరాలను సంబంధిత కమిషనర్‌కు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అందజేయడంతో వాటిని పరిశీలించి పరిష్కారం చూపినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ జాబితాపై రాజకీయ నాయకులతో పట్టణ, జిల్లాస్థాయిలో చర్చించి తుది ఓటరు జాబితాను ప్రచురించేందుకు కసరత్తు చేస్తున్నారు.
అధికారుల నియామకానికి ఆదేశాలు..
రిటర్నింగ్ అధికారులు (ఆర్వో), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకం పూర్తి చేయాలని ఇప్పటికే కలెక్టర్లకు సీడీఎంఏ నుంచి ఉత్తర్వులు అందాయి. ప్రతి రెండు, మూడు వార్డులను ఓ క్లస్టర్‌గా ఏర్పాటుచేసి వాటికి ఆర్‌ఓ, ఏఆర్వోను నియమించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
● మద్దూర్ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పాటు కావడంతో వార్డుల విభజన చేసి మ్యాపులను రూపొందించారు. మొత్తం 16 వార్డులు కాగా.. పట్టణంలో 9 వార్డులు, విలీన గ్రామాలైన రెనివట్ల, భీంపురం, నాగంపల్లి, సాపన్‌చెరువుతండా, ఎర్రగుంటతండాలతో 7 వార్డులుగా మ్యాపులను ఏర్పాటు చేశారు. ప్రతి వార్డులో రెండు పోలింగ్ కేంద్రాలు ఉండేలా చర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 72 వార్డుల్లో వార్డుకు రెండు చొప్పున, నారాయణపేటలో అదనంగా ఆరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పుర అధికారులు కేంద్రాలను పరిశీలించి ఫైనల్ చేస్తున్నారు.
రిజర్వేషన్లపై ఉత్కంఠ..
అధికారులు 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఇతర సామాజిక వర్గాల వివరాలు సేకరించారు. వీటి ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతుండటంతో.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీతో పాటు ఇతర పార్టీలు పురపాలికల్లోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆయా పార్టీల ప్రతినిధులు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. రిజర్వేషన్ ఏ విధంగా వస్తుందోననే ఉత్కంఠ ఆశావాహుల్లో కనిపిస్తుంది. ఆశావహులు వార్డుల్లో తిరుగుతూ రిజర్వేషన్ అనుకూలిస్తే బరిలోకి దిగుతామని.. ఆశీర్వదించాలని ప్రచారం చేసుకుంటున్నారు.


