పకడ్బందీగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ
నారాయణపేట: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అడిషనల్ కలెక్టర్ శ్రీను అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా తుది ఓటరు జాబితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటన, నామినేషన్ కేంద్రాలు, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు వివరాలను తెలుసుకున్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూరు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించి.. అభ్యంతరాలు స్వీకరిస్తున్నట్లు వివరించారు. మున్సిపాలిటీ పరిధిలో పోలింగ్ కేంద్రాలు, ఫొటో ఓటరు జాబితాలను ప్రకటిస్తామన్నారు. నామినేషన్ల స్వీకరణ, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. వీసీలో ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్, డిప్యూటీ కలెక్టర్లు శ్రీరామ్ ప్రణీత్, ఫణికుమార్, మున్సిపల్ కమిషనర్లు గోల్కొండ నర్సయ్య, శ్రీరాములు, నాగరాజు, శ్రీకాంత్ పాల్గొన్నారు.
చదువు, క్రీడలకు
సమప్రాధాన్యం ఇవ్వాలి
నారాయణపేట: విద్యార్థులు చదువు, క్రీడలకు సమప్రాధాన్యత ఇచ్చి ఆకాశమే హద్దుగా ముందుకుసాగాలని డీఎస్పీ నల్లపు లింగయ్య అన్నారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సీఎం కప్ 2025– 26 క్రీడా పోటీల సందర్భంగా రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి డా.వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీని స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డితో కలిసి ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి.. వారిని అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేలా చేయడమే లక్ష్యంగా సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా, సీఎం కప్ టార్చ్ ర్యాలీ మినీ స్టేడియం నుంచి సత్యనారాయణ చౌరస్తా, పాతబస్టాండ్ సెంటర్ చౌక్ మీదుగా దామరగిద్దకు చేరుకుంది. కార్యక్రమంలో డీవైఎస్‌ఓ వెంకటేశ్‌శెట్టి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శరణప్ప, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, పీడీ గొడుగు నర్సింహులు, వ్యాయామ ఉపాధ్యాయులు సాయి, అనంతసేన, బాల్‌రాజ్, రమణ, రత్నయ్య, అక్తర్ పాషా తదితరులు పాల్గొన్నారు.
పాడి పశువుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
దామరగిద్ద: పాడి పశువుల ఆరోగ్యంపై పెంపకందారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి ఈశ్వర్‌రెడ్డి సూచించారు. బుధవారం దామరగిద్ద మండలం ఉడ్మల్‌గిద్దలో పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పాడి పశువులకు గర్భకోశ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి.. చికిత్స అందించారు. అనంతరం కృత్రిమ గర్భదారణ, గర్భకోశ వ్యాధి లక్షణాలు, గర్భస్థ పశువుల ఆరోగ్య రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ సత్యమ్మ, పశువైద్యుడు శ్రీనివాస్, సూపర్‌వైజర్ ఉత్తేజ్‌కుమార్, గోపాలమిత్ర భీంషప్ప, కనకప్ప, నర్సింహులు పాల్గొన్నారు.
తెల్లకందులు క్వింటా రూ.8,211
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో బుధవారం తెల్లకందులు క్వింటా గరిష్టంగా రూ. 8,211, కనిష్టంగా రూ. 6,500 ధర పలికింది. ఎర్రకందులు గరిష్టంగా రూ.7,865, కనిష్టంగా రూ.6,200, వడ్లు (సోన) గరిష్టంగా రూ. 2,690, కనిష్టంగా రూ. 2,489 ధరలు వచ్చాయి.
పకడ్బందీగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ


