వేధింపులపై నిర్భయంగా ఫిర్యాదు చేయండి
నారాయణపేట: ఆకతాయిలు, ఇతరులు ఎవరైనా మహిళలు, యువతులు, బాలికలను వేధింపులకు గురిచేస్తే.. నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ వినీత్ ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలు, పాఠశాలల విద్యార్థినులు బస్టాండ్లు, గ్రామాలు, కాలనీల్లో ర్యాగింగ్, ఈవ్ టీజింగ్‌కు గురైనప్పుడు, ఉద్యోగులు పని చేసే ప్రదేశాల్లో వేధింపులకు గురైనప్పుడు, అలాగే బాలికలపై లైంగిక వేధింపులు జరిగినప్పుడు వెంటనే షీ టీమ్ పోలీసులను సంప్రదిస్తే సత్వర న్యాయం అందిస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా షీ టీమ్స్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మహిళలు సోషల్ మీడియా వినియోగించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఫొటోలు, వీడియోలు పోస్టు చేసే వేళ వ్యక్తిగత భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. నేరుగా ఫిర్యాదు చేయలేని వారు షీ టీమ్ ఫోన్ నెం.8712670398 కు లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని, ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచి, నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.


