భవిష్యత్ రూపకర్తలు విద్యార్థులు
● కొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలి
● ఇన్‌చార్జి కలెక్టర్ ప్రతీక్ జైన్
● ఆకట్టుకున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శన
నారాయణపేట రూరల్: విద్యార్థులు, యువత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో కొత్త ఆవిష్కరణలకు నాంది పలికి.. ప్రపంచం గుర్తించే శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఇన్‌చార్జి కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నారాయణపేట మండలం జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సైన్స్‌ఫెయిర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో దోహదపడుతాయన్నారు. చిన్నతనం నుంచే ప్రయోగాలు రూపొందించాలని.. మొదట తప్పులు జరిగినా ఆ తర్వాత కొత్త ఆవిష్కరణలు విజయవంతం అవుతాయన్నారు. తనకు సైన్స్ అంటే ఎంతో ఇష్టమని.. భౌతికశాస్త్రంతోనే ఐఏఎస్ సీటు సాధించానని గర్వంగా చెప్పారు. త్వరలో జిల్లాలోని కోస్గికి బిర్లా ప్లాంటోరియం, వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్‌లో రోబోటిక్ లైబ్రరీ ఏర్పాటు కానున్నాయని.. విద్యార్థులకు సైన్స్ పరంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విద్యార్థులు డ్రగ్స్ వంటి మహమ్మారికి దూరంగా ఉండాలని, రోడ్డు సేఫ్టీ నిబంధనలు పాటించాలని సూచించారు.
నిత్య జీవితంలో సైన్స్ ఒక భాగం..
జాతీయ సైన్స్ ఫిక్షన్ దినోత్సవం రోజున జిల్లాలో ఇంతటి గొప్ప కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అదనపు కలెక్టర్ శ్రీను అన్నారు. జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభకనబరిచి.. కామారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్‌లోనూ ప్రతిభ చాటాలని సూచించారు. ఉపాధ్యాయుల చక్కటి బోధనతోనే విద్యార్థులు గొప్ప శాస్త్రవేత్తలుగా తయారు కాగలరని అన్నారు. మనిషి జీవితం సైన్స్‌తో ముడిపడి ఉందన్నారు. ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి స్వీయ మూల్యాంకనం, సరికొత్త అన్వేషణలు, ప్రయోగాలతో గొప్ప ఫలితాలను సాధించవచ్చని అన్నారు. విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథంతో ముందుకు సాగాలన్నారు.
భవిష్యత్ రూపకర్తలు విద్యార్థులు


