‘పీఎం ధన్ ధాన్య కృషి’ ప్రణాళికలు పక్కాగా అమలు
నారాయణపేట: పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం ప్రణాళికలను జిల్లాలో పక్కాగా అమలు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం కమిటీ సభ్యులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో పథకం అమలుకు సంబంధిత అధికారులు రూపొందించిన ప్రణాళికలు, వాటి అమలు తీరుపై ఆరా తీశారు. జిల్లాలో పంటసాగు విస్తీర్ణం, పండించే పంటల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. సహజ సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరించడం, రైతుల ఆదాయం పెంచడం, గ్రామీణ జీవనోపాధికి మద్దతుతో స్థిరమైన వాతావరణ స్థితిస్థాపక వ్యవసాయాన్ని స్వీకరించడమే ఈ పథకం ఉద్దేశమన్నారు. ఈ నెల 3, 4 తేదీల్లో పథకం ప్రణాళిక, అమలుపై సమీక్షించేందుకు సెంట్రల్ నోడల్ అధికారి రమణ్‌కుమార్ జిల్లా పర్యటనకు వస్తున్నారని తెలిపారు. 3న కలెక్టరేట్‌లో కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహిస్తారని.. 4న క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారన్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలతో సభ్యులు సిద్ధంగా ఉండాలని ఇన్‌చార్జి కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీను, ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ శ్రీరామ్ ప్రణీత్, డీఏఓ జాన్ సుధాకర్, పథకం నోడల్ అధికారి సాయిబాబా, డీఆర్డీఓ మొగులప్ప, జిల్లా మత్స్యశాఖ అధికారి రహమాన్, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి ఈశ్వర్‌రెడ్డి, నీటి పారుదలశాఖ ఈఈ బ్రహ్మానందరెడ్డి, డీపీఆర్‌ఓ రషీద్ ఉన్నారు.
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి..
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాహనదారులు, పాదచారులు విధిగా రహదారి భద్రత నియమాలు పాటించాలని ఇన్‌చార్జి కలెక్టర్ ప్రతీక్ జైన్ కోరారు. రోడ్డు భద్రత మాసోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను ఆర్టీఓ మేఘాగాంధీతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం రహదారి భద్రత నియమాలు పాటిస్తామని అందరితో సామూహికంగా ప్రతిజ్ఞ చేయించారు.


