ప్రతి కూలీకి ‘ఉపాధి’ కల్పించాలి
అమరచింత: గ్రామాల్లో చేపట్టే ఉపాధి హామీ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించడంలో అధికారుల అలసత్వం కారణంగానే అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని.. ఇప్పటికై నా బాధ్యతగా పనిచేయాలని డీఆర్డీఓ ఉమాదేవి అన్నారు. అమరచింత మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సోమవారం జరిగిన ఉపాధి హమీ 4వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమంలో ఆమె పాల్గొని గ్రామాల వారీగా చేపట్టిన పనులు, కూలీలకు డబ్బుల చెల్లింపులను పరిశీలించారు. మండలంలో రూ. 5.50కోట్లతో ఉపాధి హామీ పనులు చేపట్టారని.. ఏపీఓ రఘుపతిరెడ్డి తెలిపారు. వీటికి సంబంధించి డీఆర్‌పీలు సేకరించిన వివరాలను ఒక్కొక్క పంచాయతీ వారీగా వివరాలను వెల్లడించారు. అనంతరం డీఆర్డీఓ మాట్లాడుతూ.. గ్రామాల్లో పని కావాలని అడిగితే ప్రతి కూలీకి ఉపాధి హామీ పనులు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. పనులు చేసిన కూలీలకు క్రమం తప్పకుండా కూలి డబ్బులు చెల్లించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అధికారులు ఉపాధి హామీ పనులను పర్యవేక్షించాలని.. రోజు మస్టర్‌లో కూలీల వివరాలు నమోదు చేయాలన్నారు. కాగా, పక్కదారి పట్టిన రూ. 15,010 రికవరీ చేయాలని ఏపీఓను ఆదేశించారు. సమావేశంలో అంబుర్స్‌మెంట్ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎంపీఓ నర్సింహులు, ఏపీఓ రహీం, రఘుపతిరెడ్డి, మల్లికార్జున, బాలరాజు పాల్గొన్నారు.


