అభివృద్ధి పనులు వెంటనే చేపట్టాలి
మద్దూరు: కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ మద్దూరు మండలంలోని వివిధ గ్రామాల్లో అంగన్‌వాడీ, జీపీ, పాఠశాల తదితర భవనాల పనులు వెంటనే ప్రారంభించాలని కడా అధికారి వెంకట్‌రెడ్డి అధికారులకు అదేశించారు. సోమవారం మండలంలోని వివిధ గ్రామాల్లో జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలిస్తూ, ఇంకా ప్రారంభంకాని పనులపై చర్చించారు. జాధరావ్‌పల్లితండా, మద్దూరు, దమ్‌గాన్‌పూర్, నందిపాడ్ గ్రామాల్లో రూ.20 లక్షలతో మంజూరైన అంగన్‌వాడీ భవనాలను నిర్మాణం చేపట్టకపోవడంపై పీఆర్ డిప్యూటీ ఈఈ విలోక్‌ను అడిగి తెలసుకున్నారు. కొన్ని చోట్ల స్థలాభావం, తదితర సమస్యలో పనిప్రారంభించలేదని కడా అధికారికి తెలియజేశారు. పోర్లకుంటతండా జీపీ భవన నిర్మాణం, పల్లెర్లలో రూ.కోటి 60 లక్షలతో నూతన పాఠశాల భవన నిర్మాణాలు, రూ. 80 లక్షలతో మద్దూరులో గ్రంథాలయ భవన నిర్మాణం జనవరి 5 వరకు చేపట్టకపోతే ఈ నిధులు వేరే వాటికి మళ్లించాల్సి ఉంటుందని సూచించారు. పీఏసీఎస్ చైర్మన్ నర్సింహా, మద్దూరు మున్సిపల్ కమిషన్ శ్రీకాంత్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.


