‘రైతుభరోసా’ అందేనా..?
● జిల్లాలో ప్రారంభమైన యాసంగి సాగు
● పెరిగిన పెట్టుబడులు.. తగ్గిన దిగుబడులు
● ఆర్థిక ఇబ్బందుల్లో అన్నదాతలు
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాలో యాసంగి సాగు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సీజన్‌లో అన్నదాతలు ప్రధానంగా వరి సాగు చేయనుండగా.. కొన్నిచోట్ల రైతులు నాట్లు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. మరికొందరు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. కాగా పెట్టుబడి కోసం ప్రభుత్వం అందించే రైతుభరోసా కోసం కొండత ఆశతో ఎదురు చూస్తున్నారు. శాటిలైట్ సర్వే ద్వారా సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తామని ఇటీవల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి వెల్లడించడంతో రైతులు అయోమయంలో ఉన్నారు.
సాగు భూములకే..
కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.10 వేలు ఉన్న పెట్టుబడి సాయాన్ని రూ.15 వేలకు పెంచుతామని రైతులకు హామీ ఇచ్చింది. ఈ మేరకు మొదట యాసంగి సీజన్‌లో రైతు భరోసా పథకాన్ని పాతపద్ధతిలోనే అమలు చేసి తర్వాత వానాకాలంలో ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. గుట్టలు, రహదారులు, వెంచర్లు తదితర సాగుకు యోగ్యం కాని భూములకు రైతుభరోసాను నిలిపివేసింది.
● వానాకాలంలో అధిక వర్షాలు, యూరియా కొరతతో పత్తి, వరి, కంది పంటలు సరైన దిగుబడి రాక రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా అందడం లేదు. చివరకు పంటలకు కనీస మద్దతు ధరలు కూడా లేకపోవడంతో అప్పులతో కొట్టుమిట్టాడుతున్నారు. యాసంగి సాగుకై నా వీలైనంత త్వరగా రైతు భరోసా సాయం అందించాలని కోరుతున్నారు.
జిల్లాలో ఇలా..
జిల్లాలో సన్న, చిన్న, పెద్ద రైతులు మొత్తం 1,80,221 మంది ఉండగా.. వానాకాలంలో రూ.260.93 కోట్లు ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సి ఉండింది. కాగా.. పలు కారణాలతో 534 మందికి రైతుభరోసా నిధులు చెల్లించకపోవడంతో రూ.260.56 కోట్లు మాత్రమే జమ చేశారు.


