కంది రైతుకు కన్నీరే..!
నారాయణపేట: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా వానాకాలంలో 38,568 మంది రైతులు 56,154 ఎకరాల్లో కంది సాగుచేశారు. వర్షాధార సాగులో ఎకరాకు 4 క్వింటాళ్ల చొప్పున, నీటి పారుదల సాగులో ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా జిల్లా రైతులు కంది పంటను దాదాపు 90 శాతం మేర వర్షధారంపైనే సాగుచేశారు. అత్యధికంగా దామరగిద్ద మండలంలో 10,714 మంది రైతులు 15,209 ఎకరాల్లో.. అత్యల్పంగా కృష్ణా మండలంలో 34 మంది రైతులు 93 ఎకరాల్లో కంది పండించారు. నవంబర్ రెండోవారం నుంచి పంట చేతికందుతుండటంతో రైతులు నారాయణపేట మార్కెట్‌కు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. నాణ్యతకు కాస్త అటూ ఇటుగా ఉన్న కందికి వ్యాపారులు కనీస గిట్టుబాటు ధర చెల్లించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 రోజులుగా మార్కెట్‌లో ధర పరిశీలిస్తే ఎర్ర కంది క్వింటా గరిష్టంగా రూ.7,825, కనిష్టంగా రూ.6,305.. తెల్ల కంది గరిష్టంగా రూ.7,860, కనిష్టంగా రూ.6 వేలు పలికింది. ఇదిలా ఉండగా ప్రభుత్వం మద్దతు ధరతో కంది కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని పూనుకుంది. వీటిని సకాలంలో ప్రారంభించి ఉంటే రైతులకు కాస్త మేలు జరిగేదని, కానీ విక్రయాలు జోరందుకున్నా నేటికీ ప్రారంభించకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు ఆశ్రయించి నష్టాలు చవిచూస్తున్నారు.
నాణ్యత లేదంటూ గిట్టుబాటు కాని ధరల చెల్లింపు
అధికారుల అలసత్వం.. పాలకుల నిర్లక్ష్యం
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఆలస్యం
ఆందోళనలో రైతులు
జిల్లాలో సాగు 56,154 ఎకరాలు.. దిగుబడి అంచనా2,24,588 క్వింటాళ్లు


