చన్నీళ్లే దిక్కు!
సంక్షేమ వసతిగృహాల్లో గీజర్లు, హీటర్లు కరువు
నారాయణపేట/నారాయణపేట ఎడ్యుకేషన్/మక్తల్: రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం 8 గంటలైనా మంచుదుప్పటి పర్చుకుని కనిపిస్తోంది. బయటికి రావాలంటే చలి చంపేస్తోందంటూ జంకుతున్నారు. ఈ నేపథ్యంలో వసతిగృహాల్లో విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జిల్లాలోని సంక్షేమ వసతిగృహాలను మంగళవారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ‘సాక్షి’ బృందం విజిట్ చేయగా.. అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా పలు వసతిగృహాల్లో స్నానాల గదులు సరిగ్గా లేవు. సోలార్ ప్లాంట్లు మరమ్మతుకు గురయ్యాయి. గీజర్లు, హీటర్లు లేకపోవడంతో విద్యార్థులకు చన్నీళ్లే దిక్కవుతున్నాయి. కాలకృత్యాలతో మొదలుకొని స్నానాలు పూర్తయ్యే వరకు ప్రతి అవసరానికి చన్నీళ్లనే ఉపయోగించాల్సి వస్తోంది. తమ గోడును పట్టించుకునే నాథుడే కరువయ్యారంటూ కొందరు విద్యార్థులు క్రిస్మస్ పండుగ అంటూ ఇంటిబాట పడుతున్నారు.
తగ్గుతున్న హాజరుశాతం..
జిల్లాలోని ఏ వసతిగృహాన్ని పరిశీలించినా విద్యార్థుల హాజరు శాతం రోజురోజుకు తగ్గుతూ వస్తుందని తెలిసింది. మొత్తం 13 ఎస్సీ వసతిగృహాల్లో 1,998 మంది విద్యార్థులు చేరాల్సి ఉండగా.. 1,758 మంది ఉన్నారు. అందులో 1,536 మంది వసతిగృహాల్లో ఉంటూ చదువుతున్నారు. బీసీ వసతిగృహాలు 13 ఉండగా.. 1,688 సీట్లు ఉన్నాయి. వీటిలో 1,531 మంది ప్రవేశం పొందగా.. 1,053 మంది మాత్రమే హాస్టళ్లలో ఉంటున్నారు. విద్యార్థుల హాజరు తగ్గడంపై వసతిగృహ వార్డెన్లతో ఆరా తీస్తే.. క్రిస్మస్ సెలువులు ఉండటంతో స్వగ్రామాలకు వెళ్లారని చెప్పారు. అయితే చలి తీవ్రత అధికం కావడం.. వసతిగృహాల్లో వసతుల లేమితో అవస్థలు పడుతున్న విద్యార్థులు ఇంటిబాట పడుతున్నట్లు తెలుస్తోంది.
చెడిపోయిన సోలార్ వాటర్ ప్లాంట్లు
వణికించే చలిలోనే
చన్నీటి స్నానాలు చేస్తున్న విద్యార్థులు
కొన్ని హాస్టళ్లకు కిటికీలు,
డోర్లు కూడా సరిగా లేని వైనం
తగ్గుతున్న హాజరుశాతం
చన్నీళ్లే దిక్కు!


