జీవాల్లో నట్టల నివారణ ముఖ్యం
నర్వ: జీవాల ఆరోగ్య సంరక్షణలో నట్టల నివారణ ముఖ్యమని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి ఈశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం నర్వ మండలం పెద్దకడ్మూర్, పాథర్‌చేడ్ గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటుచేసి.. మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గొర్రెలు, మేకల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఉచితంగా నట్టల నివారణ మందు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు రోజు రెండు గ్రామాల్లో నట్టల నివారణ మందు పంపిణీ చేస్తామని.. జీవాల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్లు సురేశ్, శ్రీలత పాల్గొన్నారు.
పేదల హక్కులపై కేంద్రం కత్తి
నారాయణపేట: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల హక్కులపై కత్తి నూరుతోందని ఏఐపీకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్ భవన్‌లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి సమాధి కట్టేందుకు కుట్రలు చేస్తోందన్నారు. అందులో భాగంగానే ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్తగా వీబీ రామ్‌జీ చట్టాన్ని తీసుకొచ్చిందని.. ఈ నల్ల చట్టాన్ని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏఐపీకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్రాములు, సహాయ కార్యదర్శి హాజీ మాలంగ్ ఉన్నారు.
‘మీ సొమ్ము.. మీ హక్కు’పై అవగాహన
నారాయణపేట: పదేళ్లుగా క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన బ్యాంకు డిపాజిట్లను తిరిగి పొందేందుకు ప్రభుత్వం సువర్ణావకాశం కల్పించిందని ఇన్‌చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో ‘మీ సొమ్ము.. మీ హక్కు’పై అవగాహన సదస్సు నిర్వహించగా.. ఇన్‌చార్జి కలెక్టర్‌తో పాటు ఆర్‌బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రెహమాన్, ఎస్‌బీఐ రీజనల్ ఆఫీసు నుంచి సీఎం సత్యప్రకాశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎల్‌డీఎం విజయకుమార్ మాట్లాడుతూ... క్లెయిమ్ చేయని పొదుపు ఖాతాలను ఏ విధంగా తిరిగి స్వంత యజమానులు పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అవగాహన సదస్సులో వివిధ బ్యాంకుల అధికారులు తమ బ్యాంకు స్టాళ్లను ఏర్పాటుచేసి సేవలను వివరించారు. అర్హులైన క్లెయిమ్ దారులకు సెటిల్‌మెంట్ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో బ్యాంకు అధికారులు షణ్ముఖచారి, జేమ్స్ డేవిడ్, ప్రదీప్, ప్రసన్నకుమార్, హిమాన్షు, సరుద్ధకర్ పాల్గొన్నారు.
ఎర్ర కందులు క్వింటా రూ.7,811
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని మార్కెట్‌యార్డులో మంగళవారం ఎర్ర కందులు క్వింటా గరిష్టంగా రూ. 7,811, కనిష్టంగా రూ. 5 వేల ధర పలికింది. అదే విధంగా తెల్లకందులు గరిష్టంగా రూ. 7,725, కనిష్టంగా రూ. 6,200, నల్ల కందులు రూ. 6,329, వరి (సోనా) గరిష్టంగా రూ. 2,791, కనిష్టంగా రూ. 1,800, వరి (హంస) గరిష్టంగా రూ. 2,460, కనిష్టంగా రూ. 2,200 ధరలు వచ్చాయి.
జీవాల్లో నట్టల నివారణ ముఖ్యం
జీవాల్లో నట్టల నివారణ ముఖ్యం


