మక్తల్ సమగ్రాభివృద్ధికి కృషి
మక్తల్: మున్సిపాలిటీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మక్తల్ పట్టణంలోని 4, 5, 12 వార్డుల్లో పర్యటించి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా శ్మశానవాటిక లేకపోవడంతో అవస్థలు పడుతున్నామని, తిర్మలయ్య చెరువును పునరుద్ధరించాలని, రూ. 2కోట్లతో ఖానాపురం రోడ్డు నుంచి ఏరుకలవాడ మీదుగా కన్యకా పరమేశ్వరి దేవాలయం వరకు రోడ్డు నిర్మించాలని కోరారు. ఆయా సమస్యల పరిష్కారంపై మంత్రి సానుకూలంగా స్పందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గంలో ఇప్పటికే రూ. 1,035 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. రోడ్ల నిర్మాణం కోసం రూ. 70కోట్లు మంజూరైనట్లు తెలిపారు. మక్తల్‌లో డిగ్రీ కళాశాల, 150 పడకల ఆస్పత్రి, రూ. 200కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. అనంతరం 150 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గణేశ్‌కుమార్, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటేశ్, డైరెక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు శ్రీనివాసులు, కట్టా సురేశ్, హన్మంతు, తాయప్ప, నాగేశ్, శంషొద్దీన్, ఫయాజ్, శ్రీనివాసులు, సలాం తదితరులు పాల్గొన్నారు.


