లోక్ అదాలత్‌లో 5,509 కేసుల పరిష్కారం
నారాయణపేట: జిల్లాలో ఆదివారం ఏర్పాటు చేసిన లోక్‌అదాలత్‌తో 5509 కేసులు పరిష్కరించారు. జాతీయ న్యాయ సేవాధికార ఆదేశాలతో జిల్లా న్యాయ సేవ సంస్థ లీగల్ సర్వీసెస్ ఆథారిటీ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో 4 బెంచులను ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కం చైర్మన్ నారాయణపేట బోయ శ్రీనివాసులు, లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి కం సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ , జూనియర్ సివిల్ జడ్జి సాయి మనోజ్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కే.అవినాష్ కోర్టు ఆవరణలో జరిగిన లోక్ అదాలత్‌లో అన్ని కోర్టు పరిధిలో 5509 కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించారు. జిల్లాలో 14 పోలీస్ స్టేషన్లతో పాటు రెండు ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ల (కోస్గి, నారాయణపేట) పరిధిలో ఉన్న కేసులకు న్యాయవాదులు సహకరించి పరిష్కారానికి కృషి చేశారు. కాగా మొత్తం కేసుల పరిష్కారానికిగాను రూ.26.90 లక్షల ఆదాయం ప్రభుత్వానికి సమకూరిందని ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు తెలియజేశారు. కార్యక్రమంలో అడ్వకేట్స్ కే. కురుమన్న గౌడ్ , కే. సత్యనారాయణగౌడ్, వినోద్ కుమార్, సురేంద్ర చారి , కక్షిదారులు, కోర్ట్ పోలీసులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని పీఆర్‌టీయూ ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి సమక్షంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎల్.మనోహర్‌ప్రసాద్‌గౌడ్, జనరల్ సెక్రటరీగా వి.సంతోష్‌కుమార్‌తో పాటు పలువురు రిటైర్డ్ ఉద్యోగులతో కార్యవర్గన్ని నియమించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తామని మనోమర్‌గౌడ్ పేర్కొన్నారు. అనంతరం కార్యవర్గాన్ని సన్మానించారు. సత్యనారాయణ, రాములు, సయ్యద్ మౌలనా, వెణుగౌడ్, రమేశ్‌బాబు, సుదర్శన్‌రెడ్డి, బాల్‌రాజ నర్సయ్య, క్రిష్ణరెడ్డి, అంబాజీ , వెంకట్‌రాములు తదితరులు పాల్గొన్నారు.
చదువుతోపాటు
క్రీడలు అవసరం
మక్తల్: చదువుతోపాటు క్రీడలు అవసరమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య అన్నారు. ఆదివారం మక్తల్‌లో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.గోపాలం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సీనియర్ షూటింగ్ బాల్ మెన్, ఉమెన్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఎంపిక పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో మానసికోల్లాసం పెంపొందుతుందని, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటాలన్నారు. ఈ నెల 24 నుంచి 26 వరకు వరంగల్ జిల్లా చెన్నారంలో జరిగే రాష్ట్రస్థాయి సీనియర్స్ షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొననున్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌రెడ్డి, సోంశేఖర్‌గౌడ్, ఆడమ్స్, రాజు, సత్యఆంజనేయులు, రమేష్, ఝాన్సీ, అనిత తదితరులు పాల్గొన్నారు.
ఐద్వా మహాసభలను జయప్రదం చేయండి
నాగర్‌కర్నూల్ రూరల్: ఐద్వా 14వ జాతీయ మహాసభలు హైదరాబాద్‌లో వచ్చే నెల 25 నుంచి 28 వరకు కొనసాగుతాయని.. పెద్దఎత్తున మహిళలు పాల్గొని జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందికొండ గీత పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మహాసభల్లో దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొనే ప్రధానమైన సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించి పోరాటాలు చేపడుతామన్నారు. పదేళ్లుగా మహిళలు, మైనార్టీలు, దళితులు, అట్టడుగు వర్గాలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై హింస, అభద్రత భావం, నిరుద్యోగం పెరిగిందని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, పని దొరక్కపోవడంతో మహిళలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. కార్యక్రమంలో నాయకురాలు నిర్మల, దీప, వెంకటమ్మ, ఈశ్వరమ్మ, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.


