‘ఉపాధి’లో గాంధీజీ పేరు తొలగించడం దారుణం
నారాయణపేట: గ్రామీణ ప్రాంత ప్రజలకు వంద రోజులు గ్యారంటీ ఉపాధి పనులు కల్పించాలని ఉద్దేశ్యంతో అప్పటి కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ప్రవేశ పెట్టిన జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరును తొలగించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దేశాన్ని పాలించే అర్హత కోల్పోయి, చరిత్రను మార్చే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహానేత మహాత్మా గాంధీ పేరు పథకాల నుంచి తొలగించడం అంటే గాంధీజీ సిద్ధాంతాలపై, రాజ్యాంగ విలువలపై నేరుగా దాడి చేయడమే అని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి గాంధీ పేరు తుడిచిపెట్టే ప్రయత్నాలు చేయడమే కాకుండా నెహ్రూ–గాంధీ కుటుంబాన్ని అవమానించేలా రాజకీయాలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు చరిత్రను వక్రీకరించే చర్యలు నిరంతరం కొనసాగిస్తున్నదని ఆరోపించారు. గాంధీ పేరు లేకుండా అభివృద్ధి జరగదని, గాంధీ సిద్ధాంతాలు లేకుండా భారతదేశం ముందుకు సాగదని స్పష్టం చేస్తూ, ఈ తరహా నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గాంధీ ఆశయాలను రాజ్యాంగ విలువలను ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడుతూనే ఉంటుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శివారెడ్డి,మాజీ మార్కెట్ చైర్మన్లు బండి వేణుగోపాల్, సరఫ్ నాగరాజ్, పట్టణ అధ్యక్షులు ఎండి. సలీం, ఆర్టీఓ బోర్డ్ సభ్యుడు పోషల్ రాజేష్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ఎండి. గౌస్, మార్కెట్ వైస్ చైర్మన్ హన్మంతుతోపాటు శరణప్ప, లిఖి రఘు, మహిమూద్ ఖురేషి, వినోద్ పాల్గొన్నారు.


