పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి
నారాయణపేట: రాష్ట్రంలో 2.45 లక్షల మంది పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఉమ్మడి రాష్ట్ర పీఆర్‌టీయూ మాజీ అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ఆదర్శ బీఈడీ కళాశాలలో నారాయణపేట జిల్లా పెన్షనర్ల సాధారణ సర్వసభ్య సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెన్షనర్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లే నాయకత్వం లేకపోవడంతో గత రెండేళ్లుగా పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తపరిచారు. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో 2.45 లక్షల మంది సభ్యత్వం కలిగిన పెద్ద సంఘం పెన్షనర్స్ సంఘం అన్నారు. గత పదేళ్లలో చాలా సమస్యలు పెండింగ్‌లో ఉండిపోయాయని, పెన్షనర్ల సంఘం రాష్ట్ర, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హైదరాబాద్ హెడ్‌క్వాటర్‌లో లేకపోవడంతో సభ్యులు తీవ్ర నష్టానికి గురవుతున్నారన్నారని ఆందోళన వ్యక్తపరిచారు. పెన్షనర్స్ సంఘంలో మార్పు ఎంతైన అవసరమన్నారు. తెలంగాణ ఏర్పడి ప్రాతినిత్యం వహించేందుకు జేఏసీలో కీలక భూమిక పోషించేది పెన్షనర్స్ సంఘమన్నారు. ప్రధానంగా మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో పెన్షనర్లకు హెల్త్‌కార్డులు వర్తింపజేశారన్నారు. కానీ ఇప్పుడు అంతగా పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయాన్ని ఫైనాన్స్ మినిష్టర్స్‌కు తీసుకుపోవడంలో విఫలమైందన్నారు. 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, పీఆర్‌సీ గత ప్రభుత్వం 5 శాతం తాత్కాలిక భృతి ఇచ్చిందన్నారు. కానీ ఈ ప్రభుత్వం నుంచి రెండేళ్ల నుంచి పీఆర్‌సీ ఇవ్వాల్సి ఉందన్నారు. రిటైర్డ్‌మెంట్ బెనిఫిట్స్ అందడంలేదన్నారు.ఈ నాలుగు ప్రధానమైన డిమాండ్లపై ఫిబ్రవరి మొదటి వారంలో రాష్ట్ర స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి సీఎంను ఆహ్వానించి సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు పెన్షనర్లను ఏకం చేస్తున్నామన్నారు. సమావేశంలో పెన్షనర్ల సంఘం రాష్ట్ర సంఘం నాయకులు మనోహర్‌గౌడ్, వకిల్ సంతోష్ తదితరులు ఉన్నారు.


