ప్లాస్టిక్ వినియోగిస్తే కఠిన చర్యలు
మక్తల్: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని మక్తల్ కమిషనర్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్ అన్నారు. శనివారం పురపాలిక సంఘం అన్ని విభాగాలకు చెందిన అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, పన్ను వసూలు, ప్రజా సమస్యలపై చర్చించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా తగు చర్యలు చేపట్టాలని, ప్రజలు, దుకాణదారులకు ఈమేరకు అవగాహన కల్పించాలన్నారు. అన్ని విభాగాల అధికారులు సమష్టిగా పనిచేసి ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలన్నారు. అలాగే, కాలనీల్లో నిత్యం అధికారులు పర్యటించి క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని, పారిశుద్ధ్య పనులు విధిగా చేపట్టేలా చూడాలని, వీధులు శుభ్రంగా ఉంచేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. కమిషనర్ శ్రీరాములు, ఏఈ నాగశివ తదితరులు పాల్గొన్నారు.


