జూపల్లి ఇలాకాలో ఉత్కంఠ..
● ఆయన స్వగ్రామం పెద్ద దగడ ఫలితంపై సర్వత్రా ఆసక్తి
● కొల్లాపూర్‌లోని వీపనగండ్ల, చిన్నంబావి, పాన్‌గల్‌లో తుదివిడత ఎన్నికలు
● ఆయా మండలాల్లో పొడిచిన పొత్తులతో రసవత్తరంగా పోరు
● ఒక్క ‘చిన్నంబావి’లోనే 12 జీపీల్లో కారుకు కమలం మద్దతు..
● మిగిలిన 4 పంచాయతీల్లో బీజేపీకి బీఆర్‌ఎస్ తోడ్పాటు
● మిగతా మండలాల్లోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గ ప్రజాప్రతినిధుల స్వగ్రామాల్లో ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటివరకు రెండు విడతలు జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల, వనపర్తి, దేవరకద్ర, నారాయణపేట నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్‌కు చెందిన ఆయా ఎమ్మెల్యేల సొంతూళ్లలో విపక్ష పార్టీల మద్దతుదారులు గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తుది విడతలో రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంపై అందరూ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆయన స్వగ్రామం చిన్నంబావి మండలంలోని పెద్ద దగడ గ్రామానికి బుధవారం పోలింగ్ జరగనుండగా.. ఫలితం ఏ విధంగా ఉంటుందోననే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పెద్దదగడ గ్రామ సర్పంచ్ అన్‌రిజర్వ్‌డ్ స్థానం కాగా.. ప్రధానంగా కాంగ్రెస్ బలపరిచిన ఉడుతల భాస్కర్, బీఆర్‌ఎస్ మద్దతుదారు గొంది నిరంజన్‌రెడ్డి తలపడుతున్నారు. ఎవరికి వారు తమదే గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తుండగా.. ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు.. ఈ నియోజకవర్గ పరిధిలో చివరి దఫాలో ఎన్నికలు జరిగే మండలాల్లో పోరు ఆసక్తికరంగా మారింది. చిత్రవిచిత్ర పొత్తులే ఇందుకు కారణం.
వేర్వేరుగానే.. కానీ ఒక్కటై..
తాజాగా మూడో విడతలో కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వీపనగండ్ల, చిన్నంబావి, పాన్‌గల్ మండలాల పరిధిలో మొత్తంగా 56 జీపీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మెజార్టీ స్థానాల్లో వేర్వేరుగానే.. కానీ ఒక్కటై అన్నట్లు బీఆర్‌ఎస్, బీజేపీ ఒక అవగాహనతో ఉమ్మడి అభ్యర్థులనే రంగంలోకి దింపాయి. గ్రామాల్లో బలాబలాల ప్రకారం సర్పంచ్ సీట్లు విభజన చేసుకుని.. ఆయా చోట్ల ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ ముందుకుసాగారు. ఇందుకు చిన్నంబావి మండలమే ఉదాహరణగా నిలుస్తోంది. ఈ మండలంలో 17 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులో బస్వాపురం జీపీ ఏకగ్రీవం కాగా.. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్ అయ్యాడు. గూడెం, బెక్కం, మియాపూర్, లక్ష్మీపల్లిలో సర్పంచ్‌లుగా బీజేపీకి చెందిన వారు.. మిగతా 12 గ్రామాల్లో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులు పోటీలో ఉన్నారు. పాన్‌గల్ మండలంలో బీఆర్‌ఎస్, బీజేపీ పొత్తుతో రేమద్దుల, చిక్కపల్లి, షాగాపూర్ పంచాయతీల్లో ఆయా అభ్యర్థులు సర్పంచ్‌లుగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పొత్తు చిత్తవుతుందా.. ఆ పొత్తు కాంగ్రెస్‌ను చిత్తు చేస్తుందా అనేది చర్చనీయాంశమైంది. మరోవైపు అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా స్వగ్రామమైన ఉండవెల్లి మండలం పుల్లూరులో కూడా చివరి విడతలో ఎన్నికలు జరనున్నాయి. అక్కడ ‘కారు’ దూసుకెళ్తుందా.. ‘హస్తం’ గాలి వీస్తుందా అనేది హాట్ టాపిక్‌గా మారింది.
2వ విడతలో నువ్వా.. నేనా..
రెండో విడతలో కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి మండలాల్లో 71 జీపీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ పైచేయి సాధించినా.. బీఆర్‌ఎస్ పోటాపోటీగా సర్పంచ్ స్థానాలను సాధించింది. హస్తం బలపరిచిన అభ్యర్థులు 36 మంది.. బీఆర్‌ఎస్ మద్దతుదారులు 29 మంది సర్పంచ్‌లుగా గెలుపొందారు. బీజేపీకి చెందిన ఇద్దరు.. స్వతంత్రులు మరో నలుగురు సర్పంచ్ పీఠాలను కై వసం చేసుకున్నారు. ఇందులో మండల కేంద్రాలైన పెద్దకొత్తపల్లి, పెంటవెల్లి జీపీల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలుపొందగా.. కోడేరులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. పోలింగ్ జరుగుతున్న రోజు ఆ స్వతంత్ర అభ్యర్థికి బీఆర్‌ఎస్ మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది.
జూపల్లి ఇలాకాలో ఉత్కంఠ..


