సమర్థవంతంగా తుదిదశ పోలింగ్
మక్తల్: జిల్లాలో బుధవారం జరిగే చివరి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఆదేశించారు. మంగళవారం మక్తల్, మాగనూర్, కృష్ణా, నర్వలోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ఆమె తనిఖీ చేసిన అనంతరం మాట్లాడారు. జిల్లాలో తొలి, రెండోవిడత ఎన్నికలు ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగించిన అధికారులు, పోలింగ్ సిబ్బంది కృషి అభినందనీయమని కొనియాడారు. ఇటీవల జరిగిన రెండు విడతల పోలింగ్ కేంద్రాల కంటే మూడో విడతలో అధికంగా ఉన్నాయని.. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని సూచించారు. పీఓలు, ఓపీఓలు బ్యాలెట్ పత్రాలు, చెక్‌లిస్ట్‌లోని సామగ్రిని సరి చూసుకోవాలని కోరారు. ఎన్నికల నిర్వహణకుగాను మొత్తం 2,586 మంది సిబ్బందిని నియమించామని, 32 మంది జోనల్ అధికారులు, 29 మంది రూట్ అధికారులు విధులు నిర్వర్తిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని 52 క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహిస్తున్నామని, 1,083 పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు వివరించారు. సమావేశాంలో అధికారులు జాన్ సుధాకర్, గోవిందరాజ్, రమేశ్‌కుమార్, సతీశ్‌కుమార్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.


