ఎన్నికల నిర్వహణకు గట్టి బందోబస్తు
మక్తల్: మూడోవిడత గ్రామపంచాయతీ ఎన్నికలు బుధవారం జరగనున్నాయని.. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో నిస్పక్షపాతంగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత పోలీసు అధికారులు, సిబ్బందిపై ఉందని ఎస్పీ డా. వినీత్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పోలీసు అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని మక్తల్, మాగనూర్, నర్వ, ఊట్కూర్, కృష్ణా మండలాల్లో ఎన్నికల జరగనుండగా.. 800 మంది అధికారులు, సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఐదు మండలాలను 29 రూట్లుగా విభజించి భద్రత కల్పిస్తున్నామని.. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు 5 స్ట్రైకింగ్ ఫోర్స్, 5 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నాయని తెలిపారు. విధుల్లో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని, అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో బీఎన్‌ఎస్ 163 చట్టం అమలులో ఉంటుందని.. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 200 మీటర్ల వరకు అనవసర రాకపోకలకు అనుమతించొద్దని కోరారు. కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఇంకు సీసాలు, ఇతర హనికర వస్తువులు తీసుకెళ్లకుండా తనిఖీలు నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏమై నా సమస్య తలెత్తితే ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్, డీఎస్పీలు లింగయ్య, మహేష్, రఘునాథ్ పాల్గొన్నారు.


