‘డయల్ యువర్ ఎస్పీ’కి అనూహ్య స్పందన
నారాయణపేట: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. 17మంది ఫోన్ ద్వారా ఎస్పీ డా.వినీత్‌ను సంప్రదించి వివిధ సమస్యలను తెలియజేయడంతో పాటు సలహాలు, సూచనలు అందించారు. భూ తగాదాలు, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని.. రోడ్లపై వాహనాలను పార్కింగ్ చేస్తున్నారని.. పెట్రోలింగ్ పెంచాలని.. ఆరుబయట మద్యం తాగడం, గంజాయిపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీని కోరారు. ఆయా సమస్యల పరిష్కారంపై ఆయన సానుకూలంగా స్పందించారు. డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం ద్వారా ప్రజలకు పోలీసు వ్యవస్థ మరింత చేరువ కావడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రజల్లో నమ్మకం పెరుగుతోందన్నారు. పారదర్శకంగా పనిచేయడమే పోలీసుశాఖ ప్రధాన లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
