ఏళ్లుగా ఎదురుచూపులే!
మరికల్: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి రైతులు అర్హత పొందేందుకు కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరి 1వ తేదీని కటాఫ్‌గా నిర్ణయించింది. ఈ పథకం ప్రారంభమై ఆరేళ్లు పూర్తవుతున్నా.. ఇంతవరకు కటాఫ్ తేదీని పెంచలేదు. ఫలితంగా ఆ తర్వాత భూములు పొందిన రైతులకు ఈ పథకం వర్తించడం లేదు. విరాసత్ ద్వారా భూములు పొందిన వారు మాత్రమే సమ్మాన్ నిధి కింద దరఖాస్తు చేసుకునే అవకాశముంది.
ఆరేళ్లుగా నిరీక్షణ..
కొత్తగా భూ పట్టా చేసుకున్న వారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 13 మండలాల్లో 4.59 లక్షల ఎకరాల సాగుభూమి ఉంది. 1.80 లక్షల మంది రైతులు ఉన్నారు. 2019 నాటికి 1.10 లక్షల మంది రైతులు మాత్రమే సాగులో ఉన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి 76,664 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. ఈ ఆరేళ్లలో దాదాపు 5వేల మందికి పైగా రైతులు మృతిచెందినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. ప్రస్తుతం అర్హులైన 49,826 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో కేంద్రం రూ.9.96 కోట్లను జమ చేస్తోంది. జిల్లాలో 851 మంది రైతులకు సంబంధించి ఈకేవైసీ పెండింగ్‌లో ఉండటం కారణంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అందడం లేదు.
తగ్గుతున్న లబ్ధిదారుల సంఖ్య..
రైతులకు వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాల కోసం సాయం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద పేర్లు నమోదు చేసుకున్న రైతుల్లో అర్హులకు ఏడాదికి మూడు విడతల్లో రూ. 6వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు. దంపతులకు వేర్వేరు గ్రామాల్లో భూములు ఉన్నప్పటికీ ఒకరికే లబ్ధి చేకూరుతోంది. ఆదాయపు పన్ను చెల్లించే వారు, విదేశాల్లో నివాసం ఉండే వారికి ఈ పథకం వర్తించదు. ఇప్పటి వరకు 20 విడతల్లో రైతులకు పంట పెట్టుబడి సాయం అందించారు. కటాఫ్ నిబంధన కారణంగా జిల్లాలో అర్హులైన రైతులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరడం లేదు. మరోవైపు పథకంలో వస్తున్న మార్పుల కారణంగా ఏటా లబ్ధిదారుల సంఖ్య కూడా తగ్గుతోంది.
గుర్తింపుకార్డులపై ఆశలు..
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సహా ఇతర కేంద్ర పథకాలు వర్తింపజేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తోంది. అందుకు 11 అంకెలతో విశిష్ట సంఖ్య కేటాయిస్తోంది. ఈ గుర్తింపు కార్డులతోనైనా తమకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అందుతుందేమోనని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి నోచుకోని కొత్త రైతులు
2019 ఫిబ్రవరి 1 నాటికే కటాఫ్ తేదీ
అడ్డంకులు తొలగిస్తే అర్హుల సంఖ్యపెరిగే అవకాశం
జిల్లాలో 49,826 మంది రైతుల ఖాతాల్లో డబ్బుల జమ

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
