రోడ్డెక్కిన పత్తి రైతులు | - | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన పత్తి రైతులు

Nov 4 2025 8:39 AM | Updated on Nov 4 2025 8:39 AM

రోడ్డ

రోడ్డెక్కిన పత్తి రైతులు

నారాయణపేట రూరల్‌/ఊట్కూరు: పత్తి కొనుగోళ్లకు సంబంధించి సీసీఐ నిబంధనలను సవరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం రైతులు ఆందోళనకు దిగారు. నారాయణపేట మండలం లింగంపల్లి శివారులోని హైదరాబాద్‌–యాద్గీర్‌ రహదారిపై, ఊట్కూరు మండలం మల్లేపల్లి సమీపంలోని పత్తి మిల్లు వద్ద నారాయణపేట–మక్తల్‌ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేస్తామనే నిబంధన మేరకు ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్కింగ్‌ చేసుకొని పత్తిని మిల్లులకు తీసుకొచ్చామని తెలిపారు. తీరా సీసీఐ అధికారులు ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీసీఐ నిబంధనలను సవరించి రైతులు పండించిన పత్తి మొత్తాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, ప్రధాన రహదారులపై రైతుల ఆందోళనతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఆర్డీఓ రామచందర్‌ లింగంపల్లి సమీపంలో ఆందోళనకు దిగిన రైతుల వద్దకు చేరుకొని నచ్చజెప్పారు. తిరిగి పాత విధానం ప్రకారమే కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో రైతులు రాస్తారోకోను విరమించారు. ఇదిలా ఉంటే, మల్లేపల్లి సమీపంలో రైతుల ఆందోళన విషయాన్ని తెలుసుకున్న మండల వ్యవసాయాధికారి గణేశ్‌రెడ్డి, మార్కెట్‌ కార్యదర్శి భారతి ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు.

సీసీఐ నిబంధనలు సవరించాలని డిమాండ్‌

రోడ్డెక్కిన పత్తి రైతులు1
1/1

రోడ్డెక్కిన పత్తి రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement