ఉదండాపూర్ లీక్!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో సుమారు.12.30 లక్షల ఎకరాలకు సాగు నీరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తాగు నీరు అందించాలనే లక్ష్యంతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పరిధిలో నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ కట్ట నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు నెల రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు కట్ట కోతకు గురై పగుళ్లు ఏర్పడి.. పలు చోట్ల నీరు లీకవుతోంది. ఈ మేరకు ‘సాక్షిశ్రీలో కథనం ప్రచురితం కాగా.. అధికారులు ఇటీవల మరమ్మతులు చేయించారు. తాజాగా కురిసిన వర్షంతో మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. పొలాల్లోకి నీటి ఊటలు రావడం.. కట్ట మట్టి కొట్టుకువచ్చి మేటలు వేయడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలకు వట్టెం పంప్‌హౌస్ నీట మునగడం.. తాజాగా ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి కాకముందే డొల్లతనం బయటపడడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సుమారు 20 ఫీట్ల మేర గోతులు..
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ వద్ద 15.91 టీఎంసీల సామర్థ్యంతో 9.36 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలనే లక్ష్యంతో ఈ రిజర్వాయర్‌కు శ్రీకారం చుట్టారు. ఇంతటి భారీ కట్ట నిర్మాణం నాసిరకంగా కొనసాగినట్లు ఇటీవల వర్షాలు నిరూపిస్తున్నాయి. కట్టపై ఒక్కో చోట దాదాపు 20 ఫీట్ల మేర గోతులు ఏర్పడ్డాయి. నిర్మాణంలో నాణ్యత పాటించకుండా నాసిరకం మట్టిని వాడడం.. అందులో ఉన్న రాళ్లను తీయకుండా రోలింగ్ చేయడంతో వానలకు కట్ట దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా రివిట్‌మెంట్ పనుల్లో సైతం నాణ్యత కొరవడింది. అందుకే రివిట్‌మెంట్లలో రాళ్లు చిందరవందరగా పడి ఉన్నాయని.. నీళ్లు లీకవుతుండడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోతకు గురైన రిజర్వాయర్ కట్ట
మరమ్మతులు చేసినా అదే పరిస్థితి
పలు చోట్ల పొలాల్లోకి చేరుతున్న మట్టి, బురద నీరు
రివిట్‌మెంట్ పనులు, నిర్మాణంలో నాణ్యత లేమి ?
నాసిరకం మట్టి వాడకం, సరిగ్గా రోలింగ్ చేయకపోవడమే కారణం
పనులు పూర్తికాకముందే
బయటపడిన డొల్లతనం
పొలాల్లోకి నీటి ఊటలు.. ఆందోళనలో రైతులు
ఉదండాపూర్ లీక్!


