మాతృ మరణాలు తగ్గించేందుకు చర్యలు
నారాయణపేట: జిల్లాలో మాతృ మరణాల సంఖ్యను తగ్గించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, వైద్య సిబ్బంది అవసరమైన చర్యలను తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో కలెక్టర్ అధ్యక్షతన జరిగిన మాతృ మరణాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని గుండుమాల్, దామరగిద్ద, కోటకొండ, ధన్వాడ, నారాయణపేట అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో సంభవించిన 8 మాతృ మరణాలు గురించి ఆయా కేంద్రాల వైద్యాధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయా మరణాలపై కలెక్టర్ వారిని వివరణ అడిగారు. మాతృ మరణాల సంఖ్యను తగ్గించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై వైద్య అధికారులతో చర్చించి, తగు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గర్భిణుల ఆరోగ్యంపై ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, వైద్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఇకపై ప్రతి మూడు నెలలకు సమావేశం నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
నివేదికను విశ్లేషించాలి
ప్రసూతి మరణ నివేదిక అనేది ప్రసూతి మరణ సమీక్ష నుంచి వచ్చే గోప్య పత్రం అని, మరణం చుట్టూ ఉన్న పరిస్థితులను విశ్లేషిస్తుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయచంద్రమోహన్ తెలిపారు. మరణానికి గల కారణాలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటే భవిష్యత్‌లో ప్రసూతి మరణాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అందరం సమష్టిగా పనిచేసి జిల్లాలో మాతృ మరణాలను పూర్తిగా తగ్గించేందుకు కృషి చేద్దామని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ మల్లికార్జున్, ఐఎంఏ జిల్లా చైర్మన్ డా.మల్లికార్జున్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శైలజ, పీఓఎంహెచ్‌ఎన్ డాక్టర్ సుధేష్ణ, డీజీఓహెచ్ ఓడీ డాక్టర్ అమితకుమారి, అనస్థటిస్ట్ డాక్టర్ తేజస్విని, ఎంపీహెచ్ ఈఓ గోవిందరాజు, 108 కోఆర్డినేటర్ రాఘవేందర్, సూపర్‌వైజర్ నర్మద, నర్సింగ్ అధికారిణి, పీహెచ్‌సీల వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.


