అందరికీ ఉచిత విద్య కోసం ఉద్యమిద్దాం
వనపర్తి విద్యావిభాగం: అందరికీ సమానంగా ఉచిత విద్యకోసం ఉద్యమించాల్సిన అవసరముందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొ ఫెసర్ కె.లక్ష్మీనారాయణ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహిస్తున్న పీడీఎస్‌యూ 4వ రాష్ట్ర మహాసభలు బుధవారం రెండో రోజు కొనసాగగా.. రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకట్‌రెడ్డి పీడీఎస్‌యూ జెండాను ఆవిష్కరించి విద్యార్థి ప్రతినిధుల మహాసభను ప్రారంభించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ విప్లవ విద్యార్థి ఉద్యమంలో అమరులైన వీరులకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆ తర్వాత ప్రారంభమైన విద్యా గోష్టిలో మొదటి అంశమైన శ్రీనూతన జాతీయ విద్యావిధానం – శాసీ్త్రయ విద్య మధ్య వైరుద్యాలుశ్రీ అనే అంశంపై ప్రొ.లక్ష్మీనారాయణ మాట్లాడారు. విద్య ప్రైవేటీకరణ, వ్యాపారీకరణతో సమాజంలో వెనుకబడిన వర్గాలు విద్యకు దూరమయ్యే ప్రమాదం నెలకొందన్నారు. ఇందుకు వ్యతిరేకంగా, అందరికీ సమాన ఉచిత విద్య కోసం జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, సంఘ పరివార్ శక్తులు కలిసి నూతన జాతీయ విద్యా విధానాన్ని మూడు భాగాలుగా విభజించారని.. అందులో భాగంగా విద్యను వ్యాపారీకరణ, ప్రైవేటీకరణ చేయడం, విద్యలో మతపరమైన అంశాలను చేర్చడం వంటి వాటికి కుట్రలు చేస్తున్నారన్నారు. 1964లో ప్రొ.కొఠారి కమిషన్ సూచించిన కామన్ విద్యా విధానం కోసం, శాసీ్త్రయ విద్యా విధానం కోసం పీడీఎస్‌యూ విద్యార్థి ఉద్యమాలను ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పీడీఎస్‌యూ చరిత్ర, 50ఏళ్లలో నిర్వహించిన పోరాటాలు, విద్యార్థుల త్యాగాలను రాష్ట్ర మాజీ కార్యదర్శి, కవి జనజ్వాల వివరించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జాతీయ నేత విజయ్ కన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ రఫీ, ఎస్.కిరణ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సాంబ, కార్యదర్శి బి.భాస్కర్, ఉపాధ్యక్షుడు కె.పవన్ కుమార్, రాచకొండ రంజిత్, సతీశ్, జె.గణేశ్, సైదులు, అర్జున్, వంశీ రాజు, ప్రశాంత్ పాల్గొన్నారు.


