అప్పు చెల్లించాలని వేధింపులు.. మహిళా ఉద్యోగి బలవన్మరణం
● బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి జూపల్లి
వనపర్తి: ఇచ్చిన అప్పు చెల్లించాలని వేధించడంతో ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రాత్రి జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో చోటు చేసుకుంది. పట్టణ రెండో ఎస్‌ఐ శశిధర్ కథనం మేరకు.. పాన్‌గల్ మండలం బుసిరెడ్డిపల్లికి చెందిన మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లునాయుడు, అతడి భార్య ఎండీ నసీమాబేగం అలియాస్ నీలిమ (37) తమ ఇద్దరు కుమారులతో కలిసి ఎన్టీఆర్‌కాలనీలో ఉన్న పెద్దముక్కల వసంతమ్మ, రామచంద్రయ్య ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఎండీ నసీమాబేగం అలియాస్ నీలిమ గోపాల్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిటెంట్‌గా విధులు నిర్వర్తించేది. వెంకటేశ్వర్లునాయుడు కుటుంబం తమ అవసరాల నిమితం ఇంటి యజమాని వద్ద రూ.20 లక్షలు అప్పుగా తీసుకున్నారు. కొంతకాలంగా అసలు, వడ్డీ చెల్లించాలంటూ వేధిస్తుండటంతో భరించలేక మనస్తాపానికి గురై నీలిమ మంగళవారం రాత్రి ఇంట్లోని బెడ్‌రూంలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుంది. గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తన భార్య మృతికి కారణమైన ఇంటి యజమానులపై భర్త వెంకటేశ్వర్లునాయుడు బుధవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నట్లు ఎస్‌ఐ వివరించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తన ప్రధాన అనుచరుడు వెంకటేశ్వర్లునాయుడును పరామర్శించారు. అధిక వడ్డీకి డబ్బులిస్తూ కుటుంబ విచ్ఛినానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు.


