జాతరకు తుపాను ఎఫెక్ట్
తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టెంటు కింద నైవేద్యం వండుతున్న మహిళలు
జాతర ప్రాంగణంలో వర్షంలో తడుస్తున్న భక్తులు
చిన్నచింతకుంట: మొంథా తుఫాన్ ప్రభావం కురుమూర్తి జాతరపై పడింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు వర్షం కురుస్తుండడంతో జాతర ప్రాంగణంలో వీధులన్ని బురదమయంగా మారాయి. దుకాణ సముదాయాల వద్ద, పలు చోట్ల నీరు నిలిచి గుంటలను తలపించాయి. దీంతో భక్తులు బస చేసేందుకు, నైవేద్యాలు సిద్ధం చేసేందుకు, చివరికి నడిచేందుకు సైతం ఇబ్బందులు పడ్డారు. కొందరు టెంట్లు ఏర్పాటు చేసుకోగా.. మరికొందరు వ్యాపారస్తులు ఏర్పాటుచేసుకున్న దుకాణాల కింద ఉండిపోయారు. చాలామటుకు భక్తులు స్వామివారిని దర్శించుకొని వెంటనే తిరుగు ప్రయాణం అయ్యారు. దీంతో భక్తులు లేక జాతరలోని వీధులు, దుకాణాలు వెలవెలబోయాయి.
రోడ్లు బురదమయం
వర్షం కారణంగా జాతర మైదానంలో పలు చోట్ల నీరు నిలిచి రోడ్లని బురదమయంగా మారాయి. జాతర మైదానంలోని చౌరస్తా సమీపంలో దుకాణాల సముదాయం ఎదుట, కోనేరుకు వెళ్లేదారిలో పాత సత్రం, తలనీలాలు సమర్పించే ప్రదేశంలో వర్షం నీరు నిలిచింది. విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో ఉన్న కమాన్ నుంచి రాజగోపురం వరకు, గాజుల దుకాణాలు, స్వీట్ల దుకాణాలు, రంగుల రాట్నం వెళ్లే రహదారులతోపాటు జాతర మైదానంలోని బైపాస్‌రోడ్లు మొత్తం బుదమయంగా మారాయి. అడుగుతీసి అడుగు వేయడానికి భక్తులు ఇబ్బందులు పడ్డారు.
పారిశుద్ధ్య లోపం..
జాతరలో పారిశుద్ధ్య పనులపై అధికారులు చేతులెత్తేశారు. భారీ వర్షం కురవడంతో పరిసరాలన్నీ బురద, భక్తులు వాడిపడేసిన చెత్తా చెదారంతో నిండాయి. అన్నదాన సత్రం, మంచినీటి వాటర్ ట్యాంక్ సమీపంలో, దాసంగాల షెడ్లు, విడిది గదులు, కోనేరు సమీపాన ఉన్న పాతసత్రం, కళ్యాణ పండపంలో పారిశుద్ధ్యం లోపించి ఎక్కడి చెత్త అక్కడే ఉండి పోయింది. వాటి పరిసరాలలో పందులు సంచరిస్తుండడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వర్షం కురవడంతో స్వామి వారికి నైవేద్యం సమర్పించేందుకు, గండదీపాలు మోసేందుకు, తలనీలాలు సమర్పించేందుకు భక్తులు నానా తంటాలు పడ్డారు. ఆలయం వద్ద సరిపోను దాసంగాల షెడ్లు లేకపోవడంతో భక్తులు టెంట్లు, చెట్ల కింద వర్షంలోనే నైవేద్యం తయారు చేశారు. పలువురు వర్షంలోనే తడుస్తూ గండదీపాలు మోశారు. మరోవైపు భక్తులు నేరుగా స్వామివారిని దర్శించుకొని వెనుతిరిగిపోతుండడంతో దుకాణాలన్ని వెలవెలబోయాయి. ఎలాంటి వ్యాపారాలు కొనసాగకపోవడంతో వ్యాపారస్తులు ఆందోళన చెందారు.
కంట్రోల్ రూం.. ఒక్కరోజుకే పరిమితం
కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయం కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం ఒక్కోజుకే పరిమితమైంది. జాతరలో నెలకొన్న సమస్యలు, భక్తుల ఇబ్బందులు తెలుసుకొని పరిష్కరించే దిశగా పోలీసు, రెవెన్యూ, పంచాయతీ, వైద్యారోగ్య శాఖలకు చెందిన అధికారుల కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. మంగళవారం ఉద్దాల ఉత్సవం నేపథ్యంలో దీనిని ప్రారంభించగా.. ఆ మరుసటి రోజు బుధవారం మూసివేశారు. భారీ వర్షం నేపథ్యంలో ఇబ్బందులు పడిన భక్తులకు ఈ కంట్రోల్ రూం విడిదిగా మారింది.
కురుమూర్తి స్వామికి పుష్కరిణిలో చక్రస్నానం చేయిస్తున్న పూజారులు
కురుమూర్తి జాతర మైదానం, పరిసరాలు బురదమయం
భక్తులకు తప్పని ఇబ్బందులు
వెలవెలబోయిన దుకాణాలు
జాతరకు తుపాను ఎఫెక్ట్
జాతరకు తుపాను ఎఫెక్ట్


