ఎరువు.. మరింత బరువు
మరికల్: యాసంగి పంటల సాగుకు ఎరువుల ధరల పెంపు మరింత భారం కానుంది. కొన్ని కాంప్లెక్స్ ఎరువుల ధర బస్తాకు రూ.50 పెరుగుదల ఉండగా, మరికొన్నింటి ధర పెంపు ఉంటుందని ప్రముఖ కంపెనీల డీలర్లకు సమాచారం అందింది. ప్రస్తుతం ఉన్న నిల్వలు పాత ధరలకే విక్రయిస్తున్నారు. యాసంగి సీజన్‌లో రైతులు వినియోగించే ఎరువుల ధరలు పెరుగుతాయని కంపెనీలు సంకేతాలు ఇస్తున్నాయి. ముడి సరుకు ధరలు పెరగడంతోనే ఎరువుల ధరలు పెరుగుతున్నాయని కంపెనీలు చెబుతున్నా.. ఆ భారం రైతులే మోయాల్సి వస్తోంది.
● వానాకాలం సీజన్ పూర్తయింది. ఇక యాసంగి పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా కురవడంతో చెరువులు జలకళను సంతరించుకున్నా యి. భూగర్భ జలమట్టం పెరగడంతో సాగు మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. వానాకాలం సీజన్ కంటే ముందు ఓసారి ఎరువుల ధరలు పెరగగా.. తాజాగా మరోమారు పెరగనుండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. యూరియా, డీఏపీ మినహా మిగతా కాంప్లెక్స్ ఎరువుల ధరలు మాత్రమే పెంచారు. యాసంగిలో 1.35 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు ఉంటుందని.. ఇందుకుగాను 21,500 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. తాజా వినియోగంలో ఎక్కువగా ఉండే కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచడం రైతులకు మరింత భారంగా మారింది.
పెరిగిన భూగర్భ జలాలు..
ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నిండకుండను తలపిస్తోంది. అదేస్థాయిలో చెరువులు, కుంటలు, వ్యవసాయ బోర్లలో భూగర్భ జలలు పెరిగాయి. నీటి వనరులున్న ప్రతి రైతు యాసంగిలో వరితో పాటు వేరుశనగ సాగు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు రైతులు వేరుశనగ సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. యాసంగి సీజన్‌లో వివిధ రకాల పంటల సాగు కూడా పెరగడం, ఎరువుల ధరలు అదేస్థాయిలో పెరగడం రైతులకు మరింత భారంపడనుంది.
సేంద్రియ సాగుకు మొగ్గు చూపాలి..
ఏటా ఎరువుల ధరలు పెరుగుతున్నందున రైతులు సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచాలి. అప్పుడే భూమి సారవంతంగా ఉండటమే కాకుండా దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది. ఎరువుల ధర పెంపుతో రైతులపై అదనపు భారం పడుతుంది. ఈ యాసంగిలో 21,500 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనాలు సిద్ధం చేశాం. – జాన్‌సుధాకార్, జిల్లా వ్యవసాయ అఽధికారి
యాసంగి నుంచి మళ్లీ పెరగనున్న ధరలు
బస్తాపై రూ.50 పెంపునకు నిర్ణయం
రైతులపై అదనపు భారం
జిల్లాలో 21,500 మెట్రిక్ టన్నుల అంచనా
ఎరువు.. మరింత బరువు
ఎరువు.. మరింత బరువు


