పీఎం ధన్–ధాన్య కృషి యోజనకు ప్రణాళికలు
● జిల్లాలో ప్రస్తుత స్థితిని నిర్ధారించేందుకు బేస్‌లైన్ సర్వే చేపట్టాలి
● కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట: జిల్లాలో పీఎం ధన్–ధాన్య కృషి యోజన పథకం అమలుకు పక్కా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో పీఎం ధన్–ధాన్య కృషి యోజన కమిటీ సభ్యుల మొదటి సమావేశం నిర్వహించగా.. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సహజ, సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరించడం.. రైతుల ఆదాయం పెంచడం.. గ్రామీణ జీవనోపాధికి మద్దతు ఇస్తూ స్థిరమైన వాతావరణ స్థితిస్థాపక వ్యవసాయం స్వీకరించడమే ఈ పథకం ఉద్దేశమన్నారు. జిల్లాలో పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు సంబంధిత అధికారులు వార్షిక ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. మొదటగా జిల్లాలో ప్రస్తుత స్థితిని నిర్ధారించడానికి ఒక బేస్‌లైన్ సర్వే చేపట్టాలన్నారు. ఇందులో 9 అంశాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. సర్వే అనంతరం జిల్లా వ్యవసాయ వనరులకు అనుగుణంగా సమగ్రమైన, స్థిరమైన వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. పంట తీవ్రత, ఉత్పాదకత, పంటకోత అనంతరం మౌలిక సదుపాయాలు, ఉద్యానవన, మత్స్య పరిశ్రమ, పశుపోషణ, రుణ ప్రవాహానికి వైవిధ్యంతో ముడిపడి ఉన్న ఐదేళ్ల ఫలిత ఆధారిత లక్ష్యాలు ఉంటాయని తెలిపారు. వాటిని సాధించడమే వివిధ పథకాల లక్ష్యమని కలెక్టర్ స్పష్టంచేశారు. అనంతరం అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ మాట్లాడుతూ.. రైతు ఉత్పత్తిదారుల సంస్థల ఏర్పాటు ధన్–ధాన్య కృషి యోజన పథకం అమలుకు దోహద పడుతుందన్నారు. రెండు రోజుల్లో బేస్‌లైన్ సర్వేతో కూడిన ప్రణాళికను సిద్ధం చేయాలని.. అదే విధంగా డాక్యుమెంటరీని రూపొందించాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో పథకం నోడల్ ఆఫీసర్ సాయిబాబా, డీఆర్డీఓ మొగులప్ప, డీఏఓ జాన్ సుధాకర్, జిల్లా మత్స్యశాఖ అధికారి రహమాన్, నాబార్డు జిల్లా మేనేజర్ షణ్ముఖాచారి, ఎల్‌డీఎం విజయ్ కుమార్, నీటిపారుదలశాఖ ఈఈ బ్రహ్మానందారెడ్డి, సుధాకర్‌రెడ్డి, జిల్లా కోఆపరేటివ్ అధికారి రమణారావు, పశుసంవర్ధక శాఖ అధికారి అనిరుధ్, కేవీకే శాస్త్రవేత్తలు రాజేంద్ర కుమార్‌రెడ్డి, సురేశ్ కుమార్ ఉన్నారు.
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
కోస్గి రూరల్: కోస్గి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పట్టణంలో పలు అభివృద్ధి పనులను ఆమె స్వయంగా పరిశీలించి.. మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. టీయూఎఫ్‌ఐడీసీ, కడా నిధులు రూ. 350కోట్లతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ప్రధాన లింకు రోడ్లు, అంతర్గత సీసీరోడ్లు తదితర అభివృద్ధి పనుల పురోగతిని తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగరాజు, ఈఈ విజయభాస్కర్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఇంజినీర్ జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


