వైద్య వృత్తి పవిత్రమైంది
● పేదలకు నిస్వార్థ సేవలు అందించాలి
● కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట: వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని.. ఆ వృత్తిలో ఉన్నవారు పేదలకు బాధ్యతాయుతంగా సేవలందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మండలంలోని అప్పక్‌పల్లి సమీపంలో ఉన్న ప్రభుత్వం వైద్య కళాశాల, జనరల్ ఆస్పత్రిలో కళాశాల ప్రిన్సిపాల్ డా. సంపత్‌కుమార్‌సింగ్ ఆధ్వర్యంలో సోమవారం 2025–2026 ఎంబీబీఎస్ బ్యాచ్ విద్యార్థుల ఓరియంటేషన్ డే అండ్ వైట్‌కోట్ సెరమనీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌తో పాటు ఎస్పీ డా. వినీత్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత గ్రామాల్లో వైద్యసేవలు అందించి పేదలకు అండగా ఉండి భరోసా కల్పించాలన్నారు. మీరంతా ఉన్నతస్థాయికి రావడానికి ముఖ్యమైన వ్యక్తులు తల్లిదండ్రులని.. వారి గౌరవం ఏ మాత్రం తగ్గకుండా ఉన్నతస్థాయిలో ఉండేలా చూసుకుంటూ చదువు పూర్తి చేయాలని చెప్పారు. ఎస్పీ డా. వినీత్ మాట్లాడుతూ.. తెల్లని కోటు కేవలం దుస్తువు కాదని, సేవ, బాధ్యత, కర్తవ్య నిబద్ధతకు ప్రతీకని తెలిపారు. విజ్ఞానంతో పాటు మానవత్వం కలిగిన వైద్యులుగా ఎదగాలని, క్రమశిక్షణ, నిజాయితీ, దయ అనే విలువలను ఎల్లప్పుడూ కాపాడుకోవాలని, ప్రజలకు మంచి సేవలు అందించాలని సూచించారు. చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉండాలని.. డ్రగ్స్, ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. విద్యార్థులు చెడుకు బానిస కాకుండా విద్యపైనే దృష్టిసారించి ఉన్నతస్థాయికి చేరుకోవాలని కోరారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు చదువుతున్నారా? లేదా? ఇతరాత్ర కార్యక్రమాలపై ఏమైనా శ్రద్ధ పెడుతున్నారా? వయసు ప్రభావం వంటి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. వైద్య కళాశాల, ఆస్పత్రి అభివృద్ధికి సహకరించిన, సహకరిస్తున్న కలెక్టర్‌కు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్, వైస్ ప్రిన్సిపాల్ డా.కిరణ్‌ప్రకాష్, డిప్యూటీ సూపరింటెండెంట్ డా. ఆదిత్య, ఆర్‌ఎంఓ డా. రాఘవేందర్, అన్ని శాఖల హెచ్‌ఓడీలు, వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.


