ఉత్కంఠకు తెర
● లక్కీడిప్ ద్వారా ఎంపిక చేసిన కలెక్టర్ విజయేందిర
● 14 మంది మహిళలను వరించిన అదృష్టం
● ఇద్దరు వ్యక్తులకు రెండేసి దుకాణాలు
మహబూబ్‌నగర్ క్రైం: దాదాపు నెల రోజుల నుంచి సాగిన మద్యం టెండర్ల ఉత్కంఠకు తెరపడింది. సిండికేట్‌లో టెండర్లు వేసిన వేల మందితో కలెక్టరేట్ ఆవరణంతో పాటు సమీప ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఖద్దరు చొక్కలు.. విలువైన కార్లతో మహబూబ్‌నగర్–భూత్పూర్ రోడ్డు రద్దీగా కన్పించింది. ఒక్కో దుకాణానికి ఐదు నుంచి పది మంది వరకు సిండికేట్ సభ్యులు ఉన్నారు. వారందరూ అక్కడికి చేరుకోగా కేవలం ఒక్కరిని (దరఖాస్తుదారుడు) మాత్రమే లోపలికి అనుమతి ఇచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని 54 దుకాణాలకు 1,634 దరఖాస్తులు, నారాయణపేట జిల్లాలో 36 దుకాణాలకు 853 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 2,487 దరఖాస్తులు రాగా వీరితో పాటు మరో మూడింతల వ్యాపారులు అక్కడికి చేరుకున్నారు. లక్కీడిప్‌లో దుకాణాలు దక్కించుకున్న వారు ఆనందంతో కేరింతలు కొడితే రాని వాళ్లు నిరాశతో అక్కడి నుంచి వెనుదిరిగారు.
ఒకే దగ్గర..
మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో ఉన్న 90 మద్యం దుకాణాలకు జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలోని సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 11 గంటల నుంచి కలెక్టరేట్ విజయేందిర బోయి లక్కీడిప్ తీసి దుకాణాలు కేటాయింపు చేశారు. ఒక్కో దుకాణానికి వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన కాయిన్స్ ఒక స్టీలు బాక్స్‌లో వేసి అసిస్టెంట్ ఈఎస్ నర్సింహారెడ్డి ఊపి కలెక్టర్ ముందు పెట్టాగా బాక్స్‌లో నుంచి ఒక కాయిన్ తీసి దుకాణాదారుడిని ఎంపిక చేశారు.
● మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధికంగా 52 దరఖాస్తులు వచ్చిన కోయిలకొండ 25వ దుకాణాన్ని నారాయణరెడ్డి అనే వ్యక్తి సొంతం చేసుకున్నాడు. అదేవిధంగా 9వ దుకాణాన్ని కూడా ఇతనే సొంతం చేసుకోవడం విశేషం. నారాయణపేట జిల్లాలో మక్తల్‌లో ఉన్న 62, 66 దుకాణాలను కతలప్ప అనే వ్యక్తి దక్కించుకున్నారు. మహబూబ్‌నగర్ సర్కిల్ పరిధిలో ఐదుగురు మహిళ వ్యాపారులు దుకాణాలు సొంతం చేసుకున్నారు. వీరిలో 5వ దుకాణం ఎం.స్వప్న, 15వ దుకాణం రాజేశ్వరి, 16వ దుకాణం పుష్ప, 23వ దుకాణం లక్ష్మమ్మ, 24వ దుకాణం మంజుల ఉన్నారు. ఇక జడ్చర్ల పరిధిలో 4వ దుకాణం శ్రీలక్ష్మీ, 41వ దుకాణం మేఘన, 43వ దుకాణం విజయలక్ష్మీ, 45వ దుకాణం రాణిమ్మ సొంతం చేసుకున్నారు. నారాయణపేట సర్కిల్ పరిధిలో ఇద్దరు మహిళలు, కోస్టి సర్కిల్ పరిదిలో ముగ్గురు మహిళలు లక్కీడిప్‌లో దుకాణాలు దక్కించుకున్నారు.
● రెండు జిల్లాలో ఉన్న 90 దుకాణాల్లో మహబూబ్‌నగర్‌లో ఉన్న దుకాణాలు రూ.65 లక్షల స్లాబ్‌లో ఉండటం వల్ల దుకాణం సొంతం చేసుకున్న వారు ఆ ఫీజులో 6వ వంతు రూ.10,83.500 చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా రూ.55 లక్షల స్లాబ్ కింద ఉన్న దుకాణాలు వచ్చిన వారు రూ.9,16,700, ఇక రూ.50 లక్షల స్లాబ్ కింద ఉన్న దుకాణాలు సొంతం చేసుకున్న వారు రూ.8,33,500 ఫీజు చెల్లించాలి. మొదటి రోజు రూ.కోటి నగదు వ్యాపారులు అక్కడే ఏర్పాటు చేసిన బ్యాంకులో చెల్లించారు. మిగిలిన వ్యాపారులు మంగళవారం సాయంత్రం వరకు చెల్లించాల్సి ఉంటుంది.
90 మద్యం దుకాణాలకు నూతన లైసెన్స్‌దారుల ఎంపిక
ఉత్కంఠకు తెర


