నిర్మాణ ప్రదేశం మార్పుతో ఆందోళన బాట..
ఈ క్రమంలో ప్రభుత్వం హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ అలైన్‌మెంట్‌ను మారుస్తూ గత నెల నాలుగో తేదీన సవరించిన జీఓ విడుదల చేసింది. దీని ప్రకారం గద్వాల మండలం కొత్తపల్లి నుంచి వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని జూరాల గ్రామం వరకు బ్రిడ్జి నిర్మించాలని సూచించారు. మొత్తం 10.5 కిలోమీటర్ల పొడవు నిర్మించే రహదారిలో 1,500 మీటర్ల పొడవుతో వంతెన నిర్మాణం కానుంది. గత జీఓ మేరకు రేవులపల్లి–నందిమల్ల మధ్య అధికారులు సర్వే చేయగా.. తాజా ఆదేశాలతో కొత్తపల్లి–జూరాల మధ్య రోడ్డు, వంతెన నిర్మాణం కోసం సర్వే నిర్వహిస్తున్నారు. అయితే బ్రిడ్జి నిర్మాణ ప్రదేశం మారడంతో రేవులపల్లి, నందిమల్ల గ్రామస్తులు ఆందోళనబాట పట్టారు. తొలి జీఓ ప్రకారమే బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. అధికారులకు వినతిపత్రాలు సైతం సమర్పించారు. దీంతో పాటు ఆందోళనలను ఉధృతం చేసే కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు.
ఎవరికి వారు.. భిన్నవాదనలు
● కొత్తపల్లి వద్ద బ్రిడ్జి నిర్మిస్తే తాము వ్యవసాయ పొలాలకు కూడా పోలేని దుస్థితి వస్తుందని రేవులపల్లి, నందిమల్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆనాడు ప్రాజెక్ట్ కోసం సర్వం త్యాగం చేస్తే.. నేడు చేస్తున్న మేలు ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. రియల్ వ్యాపారస్తుల కోసమే జీఓను మార్పుచేసి కొత్త స్థలాన్ని ప్రతిపాదించారని మండిపడుతున్నారు.
● గతంలో జూరాల ప్రాజెక్ట్ నిర్మాణం దిగువన జరగాల్సి ఉన్నా.. రాజకీయ పలుకుబడితో నడిగడ్డ నాయకులు పైన నిర్మాణం చేశారని జూరాల, కొత్తపల్లి, ఆత్మకూరు ప్రాంతాల ప్రజలు అంటున్నారు. ఆత్మకూరు ప్రాంతానికి మేలు జరిగేలా ఇప్పుడైనా కొత్తపల్లి – జారాల మధ్య బ్రిడ్జికి అడుగులు పడడం శుభపరిణామమని.. గద్వాల నుంచి మహబూబ్‌నగర్, హైదరాబాద్‌కు సైతం చాలా దూరం తగ్గుతుందని చెబుతున్నారు.
నిర్మాణ ప్రదేశం మార్పుతో ఆందోళన బాట..


