మోదీ చొరవతోనే రైల్వేలైన్‌కు మోక్షం
● కృష్ణా–వికారాబాద్‌పై
తప్పుడు కథనాలు సరికాదు
● మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ
నారాయణపేట రూరల్: కృష్ణా–వికారాబాద్ రైల్వే లైన్‌కు మోదీ ప్రధాని అయిన తర్వాతే మోక్షం లభించిందని, ఇందుకుగాను గతంలో రూ.20,016 కోట్లు మంజూరైనట్లు మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు. సోమవారం మండలంలోని కొల్లంపల్లిలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. గతంలో ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన తాను రైల్వే లైన్ నిర్మాణానికి నిధుల మంజూరు ప్రతిపాదనను రైల్వేశాఖ మంత్రితో చర్చించానని.. స్పందించిన కేంద్ర ప్రభుత్వం సర్వే పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. అదేవిధంగా కేంద్రం రైల్వేస్టేషన్లను ఎయిర్‌పోర్టుల తరహాలో ఆధునికీకరిస్తుందని.. అందులో ఉమ్మడి జిల్లాలోని జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల, అలంపూర్, షాద్‌నగర్ రైల్వేస్టేషన్లు ఉన్నాయని చెప్పారు. 2024 ఎన్నికల్లో రైల్వేలైన్ ఏర్పాటుపై స్పష్టమైన హామీ ఇచ్చానని.. వీలైనంత త్వరగా పూర్తి చేయిస్తానని తెలిపారు.
తప్పుడు సమాచారం సరికాదు..
కొన్ని పత్రికలు (సాక్షి కాదు) కొత్తగా కొడంగల్–వికారాబాద్ రైల్వే లైన్ అంటూ తప్పుడు ప్రచారం చేయడం సరికాదని.. రెండోలైన్ ముఖ్యమంత్రి వికారాబాద్ నుంచి కొడంగల్‌కు వేస్తున్నారా అనేది తనకు తెలియదన్నారు. కొందరు విలేకరులు పూర్తి వివరాలు తెలుసుకోకుండా వార్తలు రాయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కృష్ణా–వికారాబాద్ రైల్వే లైన్ ఏర్పాటునకు పలుమార్లు రైల్వేశాఖ మంత్రిని కలిసి ఒత్తిడి తెవడంతో సర్వే పూర్తయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ పూర్తిచేస్తే వెంటనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. సమావేశంలో బీజేపీ నాయకులు కొత్తకాపు రతంగ్‌పాండురెడ్డి, కొండ సత్యయాదవ్, సాయిబన్న, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


