
సస్యశ్యామలం చేద్దాం
రూ.574 కోట్ల రుణమాఫీ
● పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి భూ సేకరణ నోటిఫికేషన్ జారీ
● రైతులకు రూ.574 కోట్ల రుణమాఫీ
● కొత్తగా 23,411 రేషన్ కార్డుల
మంజూరు
● సన్న వడ్లకు రూ.70.44 కోట్ల బోనస్ చెల్లింపు
నారాయణపేట/మక్తల్: తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 కీలకమైన రోజు అని, హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో విలీనమై నేటికి 77 ఏళ్లు పూర్తి చేసుకుని 78వ వసంతంలోకి అడుపెడుతున్నందున రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, క్రీడలు యువజన సర్వీసులు, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు జిల్లావ్యాప్తంగా బుధవారం ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కలెక్టరేట్‌లో, మక్తల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి తోడ్పాటు అందించి అమరులైన తెలంగాణ సాయుధ, రైతాంగ పోరాట యోధులకు, స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పిస్తున్నామన్నారు.
ప్రజాపాలనకు అంకురార్పణ
సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేర్చుతున్నామని మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా నారాయణపేటలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారని, ఇప్పటి వరకు వారికి రూ.15.02 లక్షల లాభం వచ్చిందన్నారు. స్వయం సహాయక బృందాలకు జిల్లాలో 4 కొత్త బస్సులు మంజూరయ్యాయని తెలిపారు. జిల్లాలో 1.87 కోట్ల మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకోగా.. వారికి రూ. 88.14 కోట్లు ఆదా అయ్యాయని పేర్కొన్నారు. 69,808 మంది లబ్ధిదారులకు 1.84 లక్షల సిలిండర్ల మీద సబ్సిడీ ఇవ్వడంతో రూ.4.66 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు.
పేదలకు సన్నబియ్యం
ఏప్రిల్ నుంచి రేషన్ షాపుల ద్వారా జిల్లాలో 1,61,719 ఆహార భద్రత కార్డు లబ్ధిదారులకు 3,808 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేసినట్లు వెల్లడించారు. కొత్త రేషన్ కార్డులు 23,411 మంజూరు చేయగా.. 50,938 మందిని రేషన్ కార్డులో చేర్చారన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా 80,795 గృహ వినియోగదారులు లబ్ధి పొందుతున్నారని మంత్రి తెలిపారు.
నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు
రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా జిల్లాలో 19,146 మంది పేదలు చికిత్స తీసుకోగా రూ.51.89 కోట్లు చెల్లించామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.16.17 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.
లక్ష ఎకరాలకు సాగునీరు
నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగు, తాగునీరు అందించేందుకు రూ.4,350 కోట్లతో చేపట్టనున్న ఎత్తిపోతల పథకం పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి, ఎస్పీ యోగేష్‌గౌతమ్, జిల్లా అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, శ్రీను, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయకుమార్, ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, ఆర్డీఓ రామచందర్‌నాయక్, మక్తల్ సీఐ రాంలాల్, తహసీల్దార్ సతీష్‌కుమార్, కమిషనర్ నర్సిములు, ఎంపీడీఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ జెండాను
ఆవిష్కరిస్తున్న
మంత్రి వాకిటి శ్రీహరి,
కలెక్టర్ సిక్తాపట్నాయక్,
ఎమ్మెల్యే పర్ణికారెడ్డి
తదితరులు
జిల్లా కేంద్రంలో పోలీసుల గౌరవ వందనం
స్వీకరిస్తున్న మంత్రి వాకిటి శ్రీహరి
జిల్లాలో 65,631 మంది రైతులకు రూ.574 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రైతు భరోసా కింద 1,79,154 మంది రైతులకు రూ.260.56 కోట్లు చెల్లించామని తెలిపారు. 1,40,894 టన్నుల సన్న వడ్లు సేకరించి బోనస్ రూ.70.44 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు.

సస్యశ్యామలం చేద్దాం