
స్వామినాథన్ సిఫారసులు అమలు చేయాలి
నారాయణపేట టౌన్: రైతులు పండిస్తున్న పంటలకు కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ సిఫారసులకు అనుగుణంగా ఎమ్మెస్పీ నిర్ణయించాలని అఖిల భారత ఐక్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్ భవన్‌లో ఏఐయూకేఎస్ డివిజన్ అధ్యక్షుడి సమక్షంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ రైతులు పెట్టిన పెట్టుబడిపై 50 శాతం కలిపి ధాన్యానికి ధర నిర్ణయించాలన్నారు. రైతులు పంట వేసినప్పటి నుంచి అతివృష్టి, అనావృష్టి, చీడపీడలకు, అడవి జంతువుల తాకిడి నుంచి కాపాడి తీర మార్కెట్‌కు అమ్మడానికి పోతే అడవి.. కొనడానికి పోతే కొరవి అనే పరిస్థితి నెలకొందన్నారు. పత్తి క్వింటాల్‌కు రూ.10,075 ధర నిర్ణయించి కాటన్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయలన్నారు. కార్యక్రమంలో సంఘం డివిజన్ కార్యదర్శి కొండ నర్సిములు, ఉపాధ్యక్షుడు నారాయణ, సహాయ కార్యదర్శి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.