
స్వచ్ఛతా హీ సేవా వాల్‌పోస్టర్ విడుదల
నారాయణపేట: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతాయని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. బుధవారం జెడ్పీ కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాలు–2025 కు సంబంధించిన వాల్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో పరిశుభ్రత, ప్లాస్టిక్ నిర్మూలన, చెత్తాచెదారం తొలగించడం వంటి కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలన్నారు. ఎంపీడబ్ల్యూ వర్కర్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. సెప్టెంబర్ 25న ఉదయం 8 గంటలకు ఏక్ దిన్ ఏ ఘంటా ఏక్ సాత్ కార్యక్రమంలో భాగంగా యువకులు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు జాతీయ స్థాయి శ్రమదానం చేయాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 2 తో స్వచ్ఛభారత్ దివస్‌తో ముగుస్తుందని, ఈ సమాచారం మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్‌లో నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు. స్వచ్ఛతహీ సేవాలో భాగంగా కలెక్టర్ స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ మొగులప్ప, స్వచ్ఛభారత్ మిషన్ జిల్లా మేనేజర్ మాలిక్ పాషా, భార్గవ్, సిబ్బంది పాల్గొన్నారు.