
హైదరాబాద్ స్టేట్‌పై పోలీసు చర్య విద్రోహమే
నారాయణపేట: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగిన సాయుధ రైతాంగ పోరాటాన్ని నెహ్రూ యూనియన్ సైన్యాలు, రజాకార్ పోలీసులు, దొరలు, జమీందారులు కుమ్మకై ్క అణగదొక్కారని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి బి. రాము విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్ భవన్‌లో డివిజన్ కార్యదర్శి కాశీనాథ్ అధ్యక్షతన సెప్టెంబర్ 17 తెలంగాణ సాయుధ పోరాటానికి జరిగిన విద్రోహ దినంగా అభివర్ణిస్తూ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత యూనియన్ సైన్యాలు చర్య వలన ప్రజలు విముక్తి చెందకపోగా భూస్వామ్య దోపిడీ ఆధిపత్యాలకు బానిసలు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ సైన్యాలు సంస్థానాల్లోకి ప్రవేశించాక ప్రజలకు కొన్ని హక్కులు, భూ పంపకం, దోపిడీదారుల నుంచి రక్షణ లభిస్తుందని భావించినా.. అవేవి జరగ లేదని ఆరోపించారు. యూనియన్ సైన్యాలు ప్రజలపై సాగించిన హత్యాకాండ, అకృత్యాలను విమర్శిస్తూ ప్రజాసాహిత్యం వెలుగులోకి వచ్చిందన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు బి.యాదగిరి, బి.రాము, కిరణ్, చెన్నారెడ్డి, కొండ నర్సింలు పాల్గొన్నారు.