
చేపపిల్లలు చెరువుకు చేరేనా?
జిల్లాలో కేవలం ఒకే ఒక్క టెండరు దాఖలు
● మూడుసార్లు గడువు పెంచినా
ముందుకురాని వ్యాపారులు
● ఆందోళనలో మత్స్యకారులు
● టెండరుదారుడి చేపపిల్లల విత్తనోత్పత్తి
కేంద్రాన్ని పరిశీలించనున్న కమిటీ
నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో వందశాతం సబ్సిడీపై చేపపిల్లల పంపిణీకి చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ దిశానిర్దేశంతో జిల్లా మత్స్యశాఖ టెండర్ల ప్రక్రియ చేపట్టింది. మొదటగా గతనెల 18నుంచి 30వ తేదీ వరకు సంబంధిత వ్యాపారుల నుంచి టెండర్లు ఆహ్వానించారు. అయితే ఒక్క టెండరు కూడా దాఖలు కాకపోవడంతో.. మరోసారి ఈ నెల 1నుంచి 8వ తేదీ వరకు పొడిగించారు. రెండో దఫా కేవలం ఒకే ఒక టెండరు దాఖలైంది. ఈ నేపథ్యంలో 12వ తేదీ వరకు మళ్లీ అవకాశం కల్పించగా.. ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ ఒక్క దరఖాస్తును పరిగణనలోకి తీసుకొని చేపపిల్లలు పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. గతేడాది సెప్టెంబర్ చివరి వారంలోగా టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో 50శాతం మాత్రమే చేప పిల్లలను సరఫరాచేసి మమ అనిపించుకున్నారు. ఈ ఏడాది సైతం చేపపిల్లల టెండర్ల ప్రక్రియ పూర్తి కావడానికి మరో 15రోజుల సమయం పట్టే అవకాశం ఉండటంతో.. ఈ సారి కూడా వందశాతం చేపపిల్లల పంపిణీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కమిటీ పర్యవేక్షణలో..
జిల్లాలోని మత్స్యకారులకు చేపపిల్లల పంపిణీకి సంబంధించి ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మన్‌గా అడిషనల్ కలెక్టర్, మెంబర్ కం కన్వీనర్‌గా జిల్లా మత్స్యశాఖ అధికారి రహిమాన్, సభ్యులుగా జిల్లా మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు కాంతికుమార్, పశుసంవర్ధక శాఖ అధికారి, ఈడీఎం, ఇరిగేషన్ ఈఈలు ఉన్నారు. ఈ కమిటీ పర్యవేక్షణలోనే చేపపిల్లల పంపిణీ చేపట్టనున్నారు. టెండరుదారుడి విత్తనోత్పత్తి కేంద్రాలను కమిటీ పరిశీలించిన తర్వాత ఆమోదించనున్నారు.