
పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి
నారాయణపేట క్రైం: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని డీఎస్పీ లింగయ్య సిబ్బందికి సూచించారు. కోస్గి సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులకు డీఎస్పీ ఎన్. లింగయ్య తన కార్యాలయంలో పెండింగ్ కేసులపై శనివారం సమీక్ష నిర్వహించారు. నేరాల నివారణకు గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. విచారణలో ఉన్న కేసుల్లో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి సీఐ, ఎస్‌ఐల నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. కేసుల్లో శిక్షల శాతం పెంచాలని, ప్రతి కేసులో బాధ్యతాయుతమైన విచారణ ఉండాలన్నారు. పూర్తి పారదర్శకంగా కేసుల విచారణ చేపట్టడంతో పాటు కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకుషంగా పరిశోధన చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. అక్రమ ఇసుక రవాణా, గంజాయి, గుట్కా, పేకాటపై ప్రత్యేక తనిఖీలు చేపట్టి, సమూలంగా నిర్మూలించాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో త్వరితగతిన విచారణ పూర్తి చేసి 60 రోజుల్లో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. ప్రతి అధికారికి పూర్తి విచారణ, స్టేషన్ నిర్వహణ తెలిసి ఉండాలని, ప్రతిరోజు కేసులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. సామాజిక అంశాలైన సైబర్ నేరాలు, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలపై ప్రజలకు అవగాహన కల్పిచాలని కోరారు. కార్యక్రమంలో కోస్గి సీఐ సైదులు, ఎస్‌ఐలు విజయ్‌కుమార్, బాలరాజు, స్టేషన్ రైటర్లు పాల్గొన్నారు.