
గొలుసుకట్టు వ్యాపారాల జోలికి వెళ్లొద్దు : ఎస్పీ
నారాయణపేట క్రైం: మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీంలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ బుధవారం ఓ ప్రకటనలో సూచించారు. ప్రజల సొమ్ము దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడ వేస్తున్నారన్నారు. ప్రజల బలహీనతలను పెట్టుబడిగా చేసుకునేందుకు సరికొత్త పంథాలను ప్రయోగిస్తున్నారన్నారు. మోసపూరిత వాగ్ధానాలు, ప్రకటనలతో నట్టేట ముంచుతున్నారని తెలిపారు. మల్టీ లెవల్ కంపెనీల పేరుతో నిర్వహించే గొలుసుకట్టు వ్యాపారాలను నమ్మవద్దని ఎస్పీ సూచించారు. మల్టీలెవల్ వ్యాపారం ముసుగులో ప్రజల నుంచి డబ్బులు సేకరించి మోసాలకు పాల్పడుతున్నారనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. గొలుసుకట్టు మార్కెటింగ్‌లో ముందుగా చేరిన వారికి మాత్రమే లాభాలు వస్తాయని.. ఆ తర్వాత చేరిన వారంతా తీవ్రంగా నష్టపోవాల్సిందేనని తెలిపారు. ఆయా సంస్థల నిర్వాహకులు, కంపెనీలు పెట్టే సభలు, సమావేశాలకు ఎవరూ వెళ్లొద్దని.. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అబద్ధపు ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద ప్రకటనలు, వెబ్ లింక్‌లు, ఏపీకె ఫైల్స్ లాంటివి డౌన్‌లోడ్ చేయవద్దన్నారు. ఆర్థిక మోసాలపై సైబర్ క్రైం హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ తెలిపారు.
ప్రభుత్వ బడుల్లోనే
మెరుగైన విద్య
మరికల్: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని జెడ్పీ సీఈఓ శైలేల్‌కుమార్ అన్నారు. మరికల్ బాలుర ఉన్న త పాఠశాలలో గురువారం ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా తరగతి గదులు, వాష్‌రూం, వంటగదితో పాటు పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం పాఠశాలలో కల్పిస్తున్న వసతులపై విద్యార్థులతో ఆరా తీశారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన సహఫంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం నాగరత్నమ్మ పాల్గొన్నారు.
న్యాయమైన
పరిహారం ఇవ్వండి
నారాయణపేట: పేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం న్యాయమైన పరిహారం అందించాలని భూ నిర్వాసిత రైతుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు జి.వెంకట్రామారెడ్డి, కన్వీనర్ మశ్చందర్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన భూ నిర్వాసితుల స మావేశంలో వారు మాట్లాడారు. ప్రస్తుతం వ్య వసాయ భూముల ధర ఎకరా రూ. 30లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతుందన్నారు. అయితే ప్రభుత్వం రూ. 13లక్షలు లేదా రూ. 14లక్షలు ఇస్తామనడం ఆమోధయోగ్యం కాదన్నారు. మార్కెట్ ధరలను దృష్టిలో ఉంచుకొని రైతులకు పరిహారం నిర్ణయించాలని కోరారు. లేదా భూమికి బదులుగా భూమి ఇవ్వాలన్నా రు. సమావేశంలో భూ నిర్వాసితుల సంఘం నాయకులు గోపాల్, అంజిలయ్య, మహేశ్ కుమార్, ధర్మరాజు, లక్ష్మీకాంత్, కేశవ్, నారాయణ, నర్సింహులుగౌడ్, సంతోష్ ఉన్నారు.

గొలుసుకట్టు వ్యాపారాల జోలికి వెళ్లొద్దు : ఎస్పీ