
ఎకరాకు రూ.14 లక్షల పరిహారం
నారాయణపేట: ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూ సేకరణ చేపట్టి ఎకరానికి రూ.14 లక్షల పరిహారం చెల్లిస్తామని ఆర్డీఓ రామచందర్‌నాయక్ తెలిపారు. బుధవారం ఆర్డీఓ కార్యాలయంలో కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి నాలుగు మండలాల్లోని 21 గ్రామాల్లో 562.02 ఎకరాల భూ సేకరణ కోసం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ భూ సేకరణ చట్టం ప్రకారమే రైతుల నుంచి భూమి సేకరిస్తున్నామని తెలిపారు. ఎకరాకు రూ.14 లక్షలు తీసుకునేందుకు రైతులు ఒప్పుకోవడంతో ఆరుగురు రైతుల నుంచి 2 ఎకరాల 11 గుంటల పొలం సేకరించి, అందుకు సంబంధించిన చెక్కులను రైతులకు అందించారు. కడుమూరు సరస్వతికి రూ.4.55లక్షలు, కడుమూరు గోవిందుకు రూ.4.40లక్షలు, వర్కూరు చంద్రయ్యకు రూ.9.80లక్షలు, వర్కూరు రమేష్‌కు రూ.6.30లక్షలు, వర్కూర్ లక్ష్మికి రూ.1.75లక్షలు, బొమ్మలు సూగన్నకు రూ.5.25లక్షల విలువ గల చెక్కులు అందించినట్లు ఆర్డీఓ పేర్కొన్నారు. ప్రాజెక్టుకు భూములు ఇచ్చినందుకు రైతులను సన్మానించారు. కార్యక్రమంలో మక్తల్ తహసీల్దార్ రమేష్, అధికారులు పాల్గొన్నారు.
రైతు నమోదు ప్రక్రియలో వేగం పెంచాలి
కోస్గి రూరల్: కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు అందించే ప్రయోజనాలు పొందడానికి తప్పనిసరిగా రైతు నమోదు ప్రకియను వేగంగా చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ అన్నారు. బుధవారం తోగాపురంలో చేపట్టిన రైతు నమోదు ప్రకియను ఆయన పరీశీలించారు. కోస్గి మండలంలో 44,506 మంది రైతులు ఉండగా.. ఇప్పటి వరకు 10,499 మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. మిగతా రైతులు వేగంగా నమోదు చేసుకునేందుకు అధికారులు అవగాహన కల్పించాలన్నా రు. అనంతరం పట్టణంలోని పలు ఫర్టిలైజర్స్ షాపులను తనిఖీ చేశారు. యూరియా, డీఏపీ ఇతర ఎరువుల నిల్వలు రైతుల అవసరాలకు సరిపడే విధంగా ఉంచుకోవాలని డీలర్లను ఆదేశించారు. రిజిస్టర్ తప్పనిసరిగా నిర్వహించాలని, ప్రతి అమ్మకానికి రశీదు ఇవ్వాలన్నారు. గడువు తీరిన స్టాక్ ఉండరాదని, నకిలీ ఎరువులు, రసాయన మందులు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరిచారు. ఏఓ రామకృష్ణ, ఎఈఓలు వినోద్, అజయ్ ఉన్నారు.

ఎకరాకు రూ.14 లక్షల పరిహారం