
రోడ్డు విస్తరణపై ఆందోళన
మద్దూరు: మున్సిపాలిటీలో చేపట్టిన ప్రధాన రహదారి విస్తరణలో నివాసగృహాలు కోల్పోతున్న బాధితులు సోమవారం ఆందోళనకు దిగారు. స్థానిక పాతబస్టాండ్ చౌరస్తా నుంచి మున్సిపల్ కార్యాలయం గుండా చింతల్‌దిన్నె రోడ్డు వరకు ఉన్న రహదారిని 70 ఫీట్ల మేర విస్తరించేందుకు ఇటీవల అధికారులు మార్కింగ్ వేశారు. ఈ రోడ్డు విస్తరణతో దాదాపు 60 కుటుంబాలు నివాసగృహాలు కోల్పోనున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు విస్తరణ ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కడా అధికారి వెంకట్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్‌ను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణతో తాము సర్వం కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. బాధితులకు మద్దతుగా వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. కాగా, రోడ్డు విస్తరణపై మున్సిపల్, పీఆర్ అధికారులు అన్ని పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి.. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని వివరించారు.
నేడు పీయూ
మాల్‌ప్రాక్టీస్ కమిటీ భేటీ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలోని డిగ్రీ సెమిస్టర్– 2, 4, 6, ఇంటిగ్రేటెడ్ బీఈడీ 2, 4, 6 పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన విద్యార్థులు మంగళవారం పీయూ మాల్‌ప్రాక్టిస్ కమిటీ ఎదుట హాజరుకావాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుక్ అయిన విద్యార్థుల వివరాలను ప్రిన్సిపాల్స్ మెయిల్‌కు పంపించామని, వారు తప్పకుండా ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లో, మాల్ ప్రాక్టిస్ చేసినందుకు గల కారణాలపై వివరణ ఇవ్వాలని సూచించారు.